అతనో అపరాధనవలా రచయిత. తను రాసిన పుస్తకాలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతుంటాయి. ఆ ప్రతిభకు మెచ్చి స్థానిక ప్రభుత్వం ఓ అవార్డునికూడా ప్రకటించింది. కానీ ఆ క్రైం రచయిత జీవితంలో ఎవరికీ తెలియనిఅసలైన సస్పెన్స్ దాగుంది...
‘నా కొత్త నవల వర్కింగ్ టైటిల్ ‘ది బ్యూటిఫుల్ రైటర్ హూ కిల్స్’. ఇందులో క్రైం నవలా రచయిత్రి హత్యలు చేసి తప్పించుకుంటుంది. నిజ సంఘటన ఆధారంగా రచయిత్రిని సృష్టించి రాస్తున్నా. నా గత నవల ‘ది గిల్టీ సీక్రెట్’లో చెయ్యని హత్యలో రచయిత్రి ఇరుక్కుంటుంది. ఇప్పుడు కొత్త నవల్లో ఘోరంగా చంపి తప్పించు కుంటుంది ...’ చెప్పుకుపోతున్నాడు 54 ఏళ్ల అవార్డ్ విన్నింగ్ రైటర్ లీయూ.‘మీకు ఇంత నాలెడ్జి ఎలా వచ్చింది?’ అడిగారు విలేకర్లు.‘చాలా చదివా క్రైం నవలలు. చాలా చూశా క్రైం షోలు, సినిమాలు. ఇప్పుడు కొత్త నవల బిగ్ స్ర్కీన్ మీద సినిమాగా వచ్చేట్టు రాస్తా’‘కిల్లర్ రచయిత్రి ద్వారా మీరేం చెప్పదల్చుకున్నారు?’‘ఆవిడే చెప్తుంది’‘ఎవరావిడ?’‘అది సస్పెన్సు కదా’ రైతుగా పుట్టి, రచయితగా మారి, సాహిత్యాకాశంలో నక్షత్రంలా వెలుగుతున్న లీయూని ప్రభుత్వం గుర్తించి ప్రతిష్టాత్మక అన్హూయీ లిటరరీ అవార్డు ఇచ్చింది.
‘ది ఫిలిం’ పేరుతో రాసిన ప్రాచీన రొమాంటిక్ కథల సంపుటి ఈ అవార్డుని సంపాదించి పెట్టింది. ఈ కథలే టీవీలో యాభై ఎపిసోడ్లుగా వచ్చాయి. రచయితల సంఘంలో సభ్యత్వం కూడా లభించింది. ఇంత పేరు గడించినా, ఒక సాహిత్య సభలో ‘నేను రాయగలను, నమ్మరా?’ అని విమర్శకుల ఎదుట వాపోయాడు.బహుశా వ్యవసాయ నేపథ్యంలోంచి వచ్చాడు కాబట్టి ఇలా ఫీలవుతున్నాడని అనుకున్నారు. కానీ వ్యవసాయం చేస్తున్నప్పుడే ఇనిస్టిట్యూట్‌లో చేరి కథలు రాయడం నేర్చుకున్నాడు.ఇప్పుడు లీయూ సరికొత్త నవల ఎలా రాస్తాడా, అదెప్పుడొస్తుందా అని పాఠక లోకం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
అర్ధరాత్రి గెస్ట్‌హౌస్‌లో కదలిక మొదలైంది. ఇద్దరు దొంగలు ఆ గది తలుపు తట్టారు. గెస్టు, నిద్ర లేచి తలుపు తీశాడు. దొంగలు లోపలికి దూరిపోయి దోచుకోవడం మొదలుపెట్టారు. గెస్టు అడ్డుపడితే, బరువైన ఇనప్పెట్టె పెట్టి తల మీద ఫటీల్మని కొట్టారు. కుప్పకూలిపోయాడు. గెస్ట్ హౌస్ యజమాని పరుగెత్తుకొచ్చాడు. ఇనప్పెట్టె అతడి మొహాన్ని బద్దలు కొట్టింది. అతడి భార్యా పరుగెత్తుకొచ్చి, ఆమె కూడా ఇనప్పెట్టెకి బలైపోయింది. కింద ఎక్కడో ఏడ్పు విన్పిస్తూంటే వెళ్లి చూసి, ఆ పదమూడేళ్ళ మనవణ్ణి సముదాయిస్తూ సమీపించసాగారు దొంగలు...