ఒక్కో అడుగూ అతి జాగ్రత్తగా వేస్తున్నారు. మృత్యు జాడలే కన్పిస్తున్నాయి. బెడ్రూమ్‌లో కింద పడుంది శవం. చూసుకుంటూ పక్క గది దగ్గరికి వెళ్లారు. చూసుకుంటూ బాత్రూమ్‌లోకి వెళ్లారు. చూసుకుంటూ పెరట్లోకెళ్ళారు. చూసుకుంటూ రాయి దగ్గరికెళ్ళి ఆగిపోయారు ... ఎక్కడ చూసినా పచ్చి రక్తమే!

తలపగిలి పడుందామె పడకగదిలో. చేతి గాజులు పగిలాయి. పల్చటి సిల్కు వస్త్రం పడుంది పక్కన. వేలిముద్రలు, రక్తపు మరకల సేకరణ మొదలెట్టారు. సిల్కు వస్త్రం మీద, ప్లాస్టిక్‌ కవరు మీద, చేతి గాజుల మీద, ఆమె ఒంటి మీది చెదిరిన శాలువా మీదా ఇంకా తడారని రక్తాన్ని వేర్వేరు శాంపిల్స్‌గా సేకరించి మార్కింగ్‌ చేశారు. ఆ వస్తువుల్ని సీజ్‌ చేశారు. పక్క గది వరకూ పడ్డ రక్తాన్ని కూడా అదే పద్ధతిన సేకరించారు. బాత్రూమ్‌లో, బాత్రూమ్‌ బైట పైపు కింది మట్టిలో, అటు దూరంగా పడున్న రాయి మీద రక్త సేకరణ పూర్తి చేశారు. ఆ మట్టిని, రాయిని సీజ్‌ చేశారు. ప్రహరీ మీద ధూళిని పరిశీలించారు. ఫోటో గ్రాఫులూ వీడియోలూ తీశారు.‘ఏంటి?’ అన్నాడు ఇన్‌స్పెక్టర్‌ సింగ్‌ చివరికి.‘దోపిడిలా లేదు, ఇంటి దొంగలే ... బీరువాలు తెరిపించి ఫోటోలు తీసుకోవాలి’ అన్నాడు టెక్నీషియన్‌.గంటలో అన్ని సాక్ష్యాధారాలతో వెళ్ళిపోయారు రాజస్థాన్‌ మొబైల్‌ ఫోరెన్సిక్‌ లాబ్‌ టీమ్‌.

లాబ్‌లో బెంజడీన్‌ పరీక్షలకి గురిచేసి, రక్త నమూనాల్లో వున్నది రక్తమేనని నిర్ధారించుకున్నారు. మనిషి రక్తమా, జంతు రక్తమా అన్నది తేల్చడానికి జెల్‌ డిఫ్యూజన్‌ టెక్నాలజీ వాడారు. దీనికి యాంటీ సీరమ్‌ అవసరపడితే కోల్‌కతాలోని సెరాలజిస్టు నుంచి తెప్పించుకున్నారు. ఎగ్జిబిట్స్‌ అన్నిట్లోనూ వున్నది మనిషి రక్తమేనని తేలాక, బ్లడ్‌ గ్రూపింగ్‌ మొదలెట్టారు. అన్ని ఎగ్జిబిట్స్‌లోనూ ‘ఏ’ గ్రూపు రక్తమే తేలింది.పోలీసులు రక్తమంటిన ప్యాంటు, షర్టు, కత్తి తెచ్చిచ్చారు. వాటి మీద పరీక్షలు జరిపారు. ఇంకో చీర, ఒక కడ్డీ తెచ్చి అందించారు పోలీసులు.‘ఇంకేవైనా వుంటే ఇప్పుడే ఇవ్వండి’‘అన్నీ ఇచ్చేశాం’భౌతిక సాక్ష్యాధారాలన్నిటి మీద పరీక్షలు పూర్తిచేశాక నివేదిక అందించాడు జైపూర్‌ ఫోరెన్సిక్‌ లాబ్‌ డైరెక్టర్‌. పీఎం రిపోర్టు కూడా స్టడీ చేయసాగాడు ఇన్‌స్పెక్టర్‌ సింగ్‌. గొంతుమీద రక్కుళ్ళున్నాయి. మరణ సమయం ఉదయం పదీ పదకొండు గంటల మధ్య. తల మీద బలమైన గాయం వల్ల ప్రాణం పోయింది. పెనుగులాడినట్టు మరెక్కడా గాయాల్లేవు.