‘‘నా కొడుక్కి ఆ శవంతో సంబంధం లేదంటే విన్పించుకోరే? మీరన్యాయం చేస్తున్నారు!’’ అంటున్న లలితని కసురుకున్నాడు ఇన్స్‌పెక్టర్ రఘునాథ్ ప్రసాద్.‘‘వెళ్ళవమ్మా, వూరికే సతాయించకు. ఛార్జి షీట్ వేసేశాం. శవం నీ కోడలిది కాదంటావేంటి, పిచ్చా?’’ అని మండిపడి సైగ చేశాడు. లేడీ కానిస్టేబుల్స్ లాక్కెళ్ళి బయట వదిలేశారామెని.
దిగాలుపడి బండ మీద కూర్చుంది. ప్రతీసారీ ఇదే తంతు. ఆరు నెలలుగా పోలీసులు నమ్మడమే లేదు. ఏం చెయ్యాలి? అదే మెదుల్తోంది లలితాదేవి కళ్ళముందు? కుళ్ళిన శవం. కోడలిది కాదు, కొడుకు చంపలేదంటే చంపనే లేదంతే! ఇది నిశ్చయం. ఇక లాభం లేదని ప్రయాణం కట్టింది.ఎక్కడో బీహార్‌లో జగన్నాథ్ నుంచి, మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో తమ ఇంటిదాకా వచ్చేసిన ఆమెని చూసి కంగారుపడ్డాడు వియ్యంకుడు. విషయం చెప్పింది. పిచ్చిదన్నట్టు చూశాడు- ‘‘కట్నం కోసం నీ కొడుకు చంపేసింది గాక, నా కూతురు బతికే వుందని నాటకమా?’’ అని వెళ్లగొట్టేశాడు.తిరిగి ఊరికొచ్చేసింది. ఉండలేక మళ్ళీ వెళ్ళింది.గుట్టుగా వియ్యంకుడి ఇంటిదగ్గర కాపేసింది. కోడలు రింకీ కన్పిస్తుందేమోనని రోజంతా అలాగే చూసింది. చూసి చూసి తిరిగి వచ్చేసింది.
రానుపోను పదిహేను వందల కిలోమీటర్ల దుంపతెంచే ప్రయాణం. జైల్లో ఏడుస్తూ కొడుకు. వాడి బతుకు తన చేతుల్లో. కూడదీసుకుని మళ్ళీ ప్రయాణం కట్టింది. ఈసారి జాగ్రత్తగా చుట్టుపక్కల ఆరా తీసింది. వాళ్ళమ్మాయి చచ్చిపోయిందిగా అనే సమాధానమే వస్తోంది. ‘‘లేదు, అది చావలేదు. కట్నం కోసం దాన్ని వేధించలేదు. పెళ్ళయిన పదకొండు నెలలకే కన్పించకుండా పోయింది. ఊరి బయటే శవం దొరికిందని, ఆ కుళ్ళిపోయిన శవం కూతురిదేనని చెప్పి కొడుకు మీద హత్య కేసు పెట్టించారు దాని తల్లిదండ్రులు. శవానికి దహన సంస్కారాలు కూడా జరిపించేశారు. ఎవరిదో శవం. ఎవరిదా శవం?’’ తనలో తను గతాన్ని తవ్వుకుంది.
‘‘ఓవర్ యాక్షనా? పట్టించేస్తా ఇటొస్తే!’’ అని బెదిరించాడు. ఐనా తెగించి రైలెక్కింది. ఇది పదోసారి. ఆశ చావడం లేదు, అది బతికే ఉంటుందని నమ్మకం.ఈసారి నిండుగా పైట కప్పుకుని వియ్యంకుడి ఇంటి ముందు నించే వెళ్ళింది. మూడు రోజులు జబల్‌పూర్ లాడ్జిలోనే బస చేసింది. ఫలితం లేకపోయింది. డబ్బులు తెచ్చుకోవడానికి మళ్ళీ ఊరొచ్చేసింది. పైకం తీసుకుని మళ్ళీ రైలెక్కింది. ఇలా ఏడాదంతా తిరుగుతూనే ఉంది. రింకీ మాత్రం కన్పించలేదు. అసలది ఉందా లేదా? ఆ శవం దానిదేనా? ఇలా కొత్త అనుమానాలతో జబల్‌పూర్ లోనే గడిపింది. అప్పుడు భార్యతో కలిసి వియ్యంకుడు ఆటో ఎక్కుతూంటే చూసింది. ఆ ఆటో వెళ్ళీ వెళ్ళీ ఎక్కడో మాయమైపోయింది.