అతను చితికి నిప్పంటించి తలవంచుకుని భారంగా అడుగులేయసాగాడు. చితి చుట్టూ నిలబడ్డ బంధువుల్లో ముగ్గురు అతడి వెంట నడిచారు. శ్మశానవాటిక బయట కారుంది. ఆ కారు దగ్గరికి చేరుకుంటూంటే పోలీసు అధికారి కనబడ్డాడు. అతణ్ణి చూసి కలవరపడ్డాడు. ‘‘యూఆర్‌ అండర్‌ అరెస్ట్‌, లెట్స్‌ గో!’’ అన్నాడా అధికారి.బెదిరిన గుంటనక్కలా గబుక్కున పారిపోసాగాడతను ...

రాత్రెప్పుడో అతికష్టంగా కాస్త కునుకు తీసిన టీచర్‌ కల్పన, తెల్లారేలోపే లేచి, ‘‘లేవండీ, ఇంకెలా నిద్రపడుతోంది ?’’ అని భర్తని కుదిపింది.‘‘ఏం చేద్దాం లేచి? చేయాల్సిందంతా చేశాం!’’ అటు తిరిగి పడుకుంటూ బాధగా అన్నాడు హిందూరావు. మళ్ళీ ఏమనుకున్నాడో, లేచి పచార్లు చేయసాగాడు దిక్కు తోచనట్టు. బెడ్‌ మీదే కూర్చుండిపోయి, ‘‘ఎలాగండీ ఇప్పుడు?’’ అని తలపట్టుకుంది. చెప్పలేక బయటి కెళ్ళి నిలబడ్డాడు. ఇక తప్పదన్నట్టు లేస్తూ, బెడ్‌ మీద మాసిన దుప్పటి లాగేసింది. కొత్త దుప్పటి కోసం బెడ్‌ కింద డ్రాయర్‌ని లాగింది. కెవ్వున కేకేసింది. ‘‘ఏంటి! ఏమైంది?’’ పరుగెత్తుకొచ్చి అరిచాడు హిందూరావు.గజగజ వణికిపోతూ చూపిస్తోంది... డ్రాయర్‌లోంచి బయటికొచ్చిన చెయ్యిని...ఫ ఫ ఫహడలెత్తిపోయింది అపార్ట్‌మెంట్‌ అంతా. అవాక్కయి చూస్తున్నారు దృశ్యాన్ని. బెడ్‌ కింద శవం వుంటే, బెడ్‌పైన నిద్రపోయారు. గగుర్పాటు కల్గించే ఘటనకి మతి భ్రమించింది కల్పనకి. హృదయవిదారకంగా ఏదేదో మాట్లాడుతూ స్పృహ తప్పింది. శవం మీద పడి రోదిస్తున్నాడు హిందూరావు.

విస్తుపోయి చూస్తున్నాడు సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌ కవాడే. నిన్న కనిపించకుండాపోయిన కూతురు శవమై పడుంది బెడ్‌ కింద.నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్ళూ చేతులూ కట్టేసి, డ్రాయర్‌లోకి తోసి మూత పెట్టేసి... ఫైనల్‌ ఇంజనీరింగ్‌ స్నేహ!ఫ ఫ ఫనిన్న అర్ధరాత్రి దాకా వెతికి వెతికి అలసిపోయి ఇంటికొచ్చి నిద్రపోయారు. పడుకున్న బెడ్‌ కిందే, వెతుకుతున్న కూతురి శవం ఉందని తెలుసుకోలేదు. ఇదెలా జరిగి ఉంటుందని తీవ్రాలోచనలో పడ్డాడు ఇన్‌స్పెక్టర్‌ ప్రకాష్‌. దాదాపు నెలరోజులుగా స్నేహ కాలేజీకి వెళ్ళడం లేదు. కాలికి గాయమై ఇంటిపట్టునే ఉంటోంది. ఎవరెవరో ఫ్రెండ్స్‌ వచ్చి చూసి పోతున్నారు. కాలేజీలో ఆమె చాలా పాపులర్‌. మగ ఫ్రెండ్స్‌ ఎక్కువ. ఇదంతా నిన్న విచారణలోనే తేలింది. నిన్న సాయంత్రం కల్పన స్కూల్‌ నుంచి ఇంటికొచ్చి చూస్తే స్నేహ లేదు. ‘తలుపు తాళం వేయకుండా ఎక్కడికెళ్ళిందబ్బా’ అనుకుంది. కాసేపాగి ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వచ్చింది. అప్పట్నుంచీ స్విచ్చాఫే. కంగారుపడి భర్తకి కాల్‌ చేస్తే, బ్యాంకు నుంచి హిందూరావు వచ్చి, స్నేహ ఫ్రెండ్స్‌కి కాల్స్‌ చేయసాగాడు. చీకటి పడుతూండగా డీలాపడి వెళ్లి, డోంబివిలీ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు.