కన్నడ సినీనటి హేమశ్రీ హఠాన్మరణం చాలా సంచలనం రేకెత్తించింది.బెంగళూరు నుంచి ఆమె తన భర్త సురేంద్రబాబుతో కలిసి అనంతపురంలోని ఒక ఫామ్‌హౌస్‌కు వెళ్లింది. అక్కడ హఠాత్తుగా స్పృహ కోల్పోయింది. అపస్మారకస్ధితిలో ఉన్న హేమశ్రీని హుటాహుటిన కర్ణాటక రాష్ట్రంలోని హెబ్బాల సమీపంలో ఉన్న ఒక చర్చి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అప్పటికే హేమశ్రీ మరణించిందని వైద్యులు నిర్ధారించడంతో హెబ్బాల పోలీసుస్టేషన్లో జరిగిన విషయాన్ని చెప్పారు సురేంద్రబాబు. ఆ సమయంలో ఆయనతో పాటు హేమశ్రీ తల్లి లీలావతి కూడా ఉంది.మరుసటి రోజు పత్రికల్లో రకరకాల కథనాలు...బెంగళూరులో ఉండాల్సిన హేమశ్రీ అనంతపురం జిల్లా రెడ్డిపల్లిలోని ఫామ్‌హౌస్‌కు ఎందుకు వెళ్లింది? అక్కడ భర్తతో గొడవపడిందా? అసలా ఫామ్‌హౌస్‌ ఎవరిది? భర్తతో కలిసి హైదరాబాద్‌ వెళ్తున్నానని స్నేహితులకు చెప్పిన హేమశ్రీ విగతజీవురాలుగా తిరిగి రావడానికి కారణాలేమిటి? ఇలాంటి అనేక ప్రశ్నలను లేవనెత్తుతూ పత్రికల్లో పతాక శీర్షికల్లో వార్తలు వచ్చాయి.ఇంతలో హేమశ్రీ మాజీ ప్రియుడు మంజునాథ్‌ తెర మీదకు వచ్చాడు.

హేమశ్రీకి సురేంద్రబాబును పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, ఆమె తల్లి బలవంతం మీద ఈ పెళ్లి జరిగిందని, తన కన్నా 20 ఏళ్ల పెద్దవాడిని తనకు కట్టబెట్టడాన్ని జీర్ణించుకోలేక హేమ తనతో పలుమార్లు ఆ విషయం చెప్పి బాధపడిందని చెప్పి సంబంధిత ఆడియో టేపులను మంజునాథ్‌ మీడియాకు విడుదల చేశాడు. దాంతో హేమశ్రీ మరణం మరింత మిస్టరీగా మారింది.

***********************************

అదే సమయంలో తెలుగు దినపత్రికల్లోనూ హేమశ్రీ మరణం వెనుక దారుణమైన నిజాలున్నాయని, పెద్దల హస్తముందని, ఆమెపై అత్యాచారయత్నం జరిగిందని కథనాలు వచ్చాయి. అనంతపురం జిల్లాకు చెందిన ఒక మంత్రి వద్దకు హేమశ్రీని పంపడానికి ఇద్దరు కార్పొరేటర్లు ప్రయత్నించారని, ఆమె ప్రతిఘటించడంతో మత్తుమందు ఇచ్చారని, ఆ క్రమంలో జరిగిన ఘర్షణలో హేమ మరణించిందని కూడా వార్తలు వచ్చాయి.రకరకాల కథనాలు రావడంతో బెంగళూరు నగర కమిషనర్‌ జ్యోతిప్రకాష్‌ స్వయంగా కేసును సమీక్షించారు. హెబ్బాల పోలీసుల నుంచి వివరాలు తెలుసుకోవడంతో పాటు, రాయలసీమ పోలీసు ఐ.జి. గోవింద్‌సింగ్‌తోనూ మాట్లాడారు. పోస్టుమార్టం రిపోర్టులను పరిశీలించారు. హేమశ్రీ ఎక్కువ మత్తుమందు పీల్చడం వల్ల మరణించిందని పోస్టుమార్టం నివేదిక స్పష్టం చేయడంతో ఆమెతో పాటు చివరివరకు ఉన్న వారిని తీసుకొచ్చి విచారణ ప్రారంభించాలని హెబ్బాల పోలీసులను కమిషనర్‌ ఆదేశించారు.