మిర్జాపూర్ జిల్లాలోని కఛ్వా పోలీస్‌స్టేషన్... అప్పుడే నైట్ డ్యూటీ ముగించుకున్న ఇన్‌స్పెక్టర్ మిశ్రా ఇంటికి వెళ్ళడానికి లేచాడు.సరిగ్గా అదే సమయంలో దయారామ్ ఏడుస్తూ పోలీస్‌స్టేషన్‌లోకి అడుగుపెట్టాడు.‘‘సార్! నా కూతురును ఎవరో చంపేశారు. ఆమె శవం ఊరి బయట పొలంలో పడి ఉండి’’ అని గుండెలు బాదుకుంటూ ఏడ్వసాగాడు.‘‘మీకు కలిగిన కష్టానికి చింతిస్తున్నాను. అన్ని విషయాలు వివరంగా చెప్పు’’ అంటూ అతని భుజం మీద చెయ్యివేసి కూర్చోబెట్టి కానిస్టేబుల్‌కు సైగచేసి గ్లాసు మంచి నీళ్ళు ఇప్పించాడు ఇన్‌స్పెక్టర్ మిశ్రా.
దయారామ్ నీళ్ళు తాగి, నోరు తుడుచుకుని, కాస్త కుదుటపడ్డాడు.‘‘సార్! నా పేరు దయారామ్. నేనూ ‘సేమ్రా’ గ్రామస్థుడిని. నిన్న రాత్రి అదే ఊళ్ళోని మా బంధువుల ఇంట్లో పెళ్ళి నిశ్చితార్థం చేసుకోవటానికి పెండ్లి కుమారుడి పక్షపు పెద్దలు వచ్చారు. మా కుటుంబ సభ్యులందరూ అక్కడికివెళ్ళారు. నేనూ వెళ్ళాను. నా కూతురు నీల ఒక్కతే ఇంట్లో ఉండిపోయింది. మా అమ్మాయికి వచ్చే తొమ్మిదవ తేదీన వివాహం జరగాల్సి ఉంది. ఆ కారణంగా మా ఇంటి ఆచారాల ప్రకారం పెళ్ళి కాబోతున్న పిల్లను నిశ్చితార్థం జరిగే స్థలానికి తీసుకుని వెళ్ళలేదు. కార్యక్రమం జరిగిన తరువాత మేమంతా తిరిగి వచ్చి చూస్తే మా అమ్మాయి నీల ఇంట్లో కనిపించలేదు. ఇరుగు పొరుగు ఇళ్ళకు వెళ్ళిందేమోనని అడిగితే మాకు తెలియదన్నారు. మాకు తెలిసినవారి ఇళ్ళకు, దగ్గరి బంధువుల ఇళ్ళకు వెళ్ళి విచారించినా ఎవరింటికి నీల వెళ్ళలేదని తెలిసింది.
దాంతో ఊళ్ళోనూ ఊరి బయట పొలాల్లోను వెదికితే అక్కడ మా పిల్ల శవం కనిపించింది సార్. ఎవరో చంపేశారు’’ అన్నాడు దయారామ్ గద్గదస్వరంతో.ఇన్‌స్పెక్టర్ మిశ్రా కేసు నమోదు చేసుకుని తన సిబ్బందిని వెంటబెట్టుకుని హుటాహుటిన సంఘటనా స్థలాన్ని చేరుకున్నాడు.ఊరి బయటి పొలంలో రక్తపు మడుగులో నీల శవం నగ్నంగా పడి ఉంది.శవానికి దగ్గర్లోనే ఆమె దుస్తులు చిరిగి పీలికలై పడి ఉన్నాయి.పొలం మట్టిలో పడి ఉన్న అడుగుల గుర్తులను బట్టి ఒకరికంటే ఎక్కువ మంది ఇందులో పాల్గొన్నట్టు ఇన్‌స్పెక్టర్ మిశ్రా ఊహించాడు.