బతుకుతెరువుకోసం పొట్టచేతపట్టుకుని వచ్చాడతను. లాటరీ టిక్కెట్లు అమ్మేదుకాణం తెరిచాడు. అదృష్టం కలిసొచ్చింది. బాగా సంపాదించడం ప్రారంభించాడు. తనలాగే ఆ నగరానికి ఉద్యోగరీత్యా వచ్చిన తన ఊరివాళ్ళు తారసపడ్డారు. వారితో స్నేహం పెంచుకున్నాడు. కానీ ఆకస్మికంగా అతను జాడతెలియకుండాపోయాడు. జీవితంలో అతను దారితప్పాడా?
తిలక్‌నగర్ పోలీస్‌స్టేషన్‌సమయం ఉదయం పదిగంటలు.ఓ యువతి పరుగున పోలీసుస్టేషనుకొచ్చింది.ఇన్‌స్పెక్టర్ నారాయణరావ్ తలెత్తి అందమైన ఆ యువతివైపు ప్రశ్నార్థకంగా చూశాడు.ఆ యువతి కళ్ళొత్తుకుంటూ ఓ ఫొటోతీసి అతడికి అందించింది.అది ఆ యువతి పెళ్ళినాటి ఫొటో.కూర్చోమన్నట్టు చేత్తో సైగచేశాడు ఇన్‌స్పెక్టర్.‘‘మీ సమస్య ఏమిటో చెప్పండి’’ అన్నాడు.‘‘నా పేరు వీణ. నా భర్త వీరేంద్ర. పాలమ్‌కాలనీలో మాకు ‘వీరేంద్ర లాటరీ కార్నర్’ అని షాపు ఉంది. రెండ్రోజుల క్రితం ఇంటినుంచి సైకిల్ మీద షాపుకు వెళ్ళాడు. ఇంకా ఇంటికి తిరిగి రానేలేదు. నేను వెళ్ళిచూస్తే అసలు షాపుకే వెళ్ళలేదట. ఏదైనా అర్జంట్ పనిమీద ఊరెళ్ళారనుకున్నాను. కానీ ఇప్పటివరకు కనీసం ఫోన్‌కూడా చెయ్యలేదు. అందుకే మీ దగ్గరికి వచ్చాను’’ అంది వీణ వెక్కివెక్కి ఏడుస్తూ.‘‘ఆయనకు శత్రువులున్నారా?’’లేరన్నట్టు వీణ తలూపింది.‘‘చెడు అలవాట్లు?’’‘‘ఏమీ లేవండి’’ అందామె గద్గదస్వరంతోఆమె నుంచి మరికొన్ని వివరాలు రాబట్టి రిపోర్ట్ రాసుకుని ఆమెను పంపేశాడు ఇన్స్‌పెక్టర్.
ఈకేసును సబ్ ఇన్‌స్పెక్టర్ అనిల్‌కుమార్‌కి అప్పగించాడు ఇన్‌స్పెక్టర్ నారాయణరావ్. సబ్ ఇన్‌స్పెక్టర్ అనిల్‌కుమార్ వెంటనే ‘పాలమ్‌కాలనీ’లోని వీరేంద్ర లాటరీ కార్నర్‌కు వెళ్ళి చుట్టుపక్కల ఆరాతీశాడు. రెండురోజుల క్రితం తన దుకాణం తెరిచాడు. రాత్రి తొమ్మిది వరకు దుకాణంలోనే ఉన్నాడు.వీరేంద్ర ఉదయం తన షాపుకు వెళ్ళలేదని తెలిసిందనీ, రాత్రి ఇంటికి తిరిగిరాలేదని నివేదికలో వీణ పేర్కొన్న విషయం గుర్తొచ్చింది అనిల్‌కుమార్‌కు. వీణ అబద్ధం చెబుతోందని సందేహించాడు. వెంటనే వీరేంద్ర ఇంటి చుట్టుపక్కల వారిని ఎంక్వైరీ చేశాడు. ఆ దర్యాప్తులో అనిల్‌కుమార్‌కు విలువైన సమాచారం లభించింది. అనిల్‌కుమార్ ఇన్‌స్పెక్టర్ నారాయణరావ్‌తో చర్చించాడు.అనిల్‌కుమార్ చెప్పింది విన్న నారాయణరావ్, వెంటనే వీణను పోలీస్‌స్టేషన్‌కు తీసుకురమ్మని ఆదేశించాడు. అతడు వెంటనే ఆమెను పోలీస్టేషన్‌లో నిలబెట్టాడు. పోలీస్‌స్టేషన్‌లో వాతావరణం చూసి భయపడిపోయింది వీణ. పోలీసుప్రశ్నలధాటికి బెరుకుతనం, గిల్టీఫీలింగ్ తట్టుకోలేక జరిగినదంతా చెప్పేసింది.