‘‘కిడ్నాప్ కేసులలో సమయమే ముఖ్యం. శరవేగంగా కేసుపరిష్కారదశకు చేరాలి.ముందుగా పాపను ఎత్తుకుపోయారని గుర్తించిన తరువాత పోలీసులకు రిపోర్టు ఇచ్చేసరికే కొంత సమయం వ్యర్థమైపోతుంది’’ అసిస్టెంట్ రాముకు వివరిస్తున్న డిటెక్టివ్ శరత్ ఆగి, మోగుతున్న ఫోన్ ఎత్తి ‘‘హలో’’ అన్నాడు.
అవతలివైపున ఎవరో ఏదో చెప్పారు. విన్న తర్వాత ఫోను పెట్టేసి, రాముతో ‘‘చలో’’ అన్నాడు.‘‘ఏమైంది బాస్?’’ అడిగాడు రాము.‘‘ప్రముఖ వ్యాపారవేత్త ప్రసాద్ కూతురు ప్రణతిని ఎవరో కిడ్నాప్ చేశారట’’చెప్పాడు శరత్ పెద్ద పెద్ద అంగలేస్తూ. ‘‘జరిగింది చెప్పుకోటానికి గమ్మత్తుగా ఉంటుంది. రామ్‌లాల్ నా సేవకుడు. మా ఔట్‌హౌస్‌లో ఉంటాడు. మా అమ్మాయి ప్రణతి. నా సేవకుడి కూతురు ప్రణవి. ఇద్దరిదీ ఒకే వయసు. అందుకని అందుకే మా ప్రణతి వాడేసిన బట్టలు దానికి ఇస్తుంటాము. అలా ఈరోజు ప్రణవి, ప్రణతి బట్టలు వేసుకుని ఉంది. ప్రణతిని స్కూలు నుంచి తీసుకురావటానికి వెళ్ళిన కారులో ప్రణవి కూడా వెళ్లింది. డ్రైవర్ లోపలకు వెళ్లి అమ్మాయిని తీసుకువచ్చేలోగా, ప్రణవి కారు దిగినట్టుంది.
అది నా కూతురే అనుకుని కిడ్నాపర్లు ఎత్తుకు పోయినట్టున్నారు. నా కూతురిని ఎత్తుకుపోతే, కేసును ఎంత సీరియస్‌గా టేకప్‌చేసి పరిశోధిస్తారో అంతే సీరియస్‌గా, వేగంగా పరిశోధించి అమ్మాయిని వెతికి పట్టుకోవాలి’ గబగబా చెప్పాడు ప్రసాద్.‘‘కిడ్నాప్‌కు గురైనది ఎవరైనా మాకు ఒక్కటే. చట్టం ముందు అందరూ సమానమే. పరిశోధన అనేది ధనవంతుడి సంతానమైతే ఒకరకంగా, పేదవారి సంతానమైతే ఇంకోరకంగా ఉండదు’’ నిర్మొహమాటంగా చెప్పాడు శరత్. ఇన్స్పెక్టర్ విజయ్‌వైపు తిరిగి, ‘‘ఇంతవరకూ జరిగిన పరిశోధన వివరాలు కావాలి’’ అన్నాడు.