తిండికీ బట్టకీతప్ప చాలీచాలని సంసారం. ఆ పల్లెటూరులో కేవలం వ్యవసాయంమీద ఆధారపడి బతికితే రోజులు గడిచేదెలా? పిల్లల భవిష్యత్తు ఎలా? రోజూ భర్తను సతాయించేది ఆమె. భర్త స్పందించలేదు. చివరకు తనే ధైర్యంచేసి పొరుగూరు వెళ్ళి నిజాయితీగా చిన్న వ్యాపారం ప్రారంభించింది. ఆమె వ్యాపారం పుంజుకుందా? తన కుటుంబాన్ని తీర్చిదిద్దుకుందా?
సమయం ఉదయం పది గంటలు.పార్కులో జనసంచారం చాలా తక్కువగా ఉంది.గార్డు శ్యామ్‌ప్రసాద్ డ్యూటీకి రాగానే యథాలాపంగా పార్కు నలుదిక్కులా తిరగసాగాడు.ఒకచోట గుబురు పొదలపై కాకులు, గద్దలు తిరుగుతుండడం చూసి అటువైపు నడిచాడు.వాటిని తోలబోయినవాడల్లా పొదలమధ్యకు చూశాడు. అతడి కళ్ళు భయంతో విచ్చుకున్నాయి.పొదలమధ్య యువతి మృతదేహం! శవాన్ని చూడగానే కేకలు వేస్తూ ఫారెస్టర్ కార్యాలయం వైపు పరుగుతీశాడు. విషయం తెలియగానే ఫారెస్టర్ మదన్‌సింగ్‌వచ్చి శవాన్నిచూసి, ఠాకూర్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌కు కబురు అందించాడు.ఇన్‌స్పెక్టర్ ప్రతాప్‌సింగ్ సిబ్బందితో ఘటనాస్థలికి చేరుకున్నాడు.చీర, బ్లౌజులో ఉన్న 35ఏళ్ళ యువతి మృతదేహం. శవాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు.
పొట్టలో కత్తిపోట్లవల్ల ఆమె నడుంచుట్టూ రక్తం మడుగుకట్టింది. కొద్దిదూరంలో ఆమె చెప్పులు పడున్నాయి. మృతురాలి కుడిచేతిపై ‘ఎం.సింగ్’ అనే పచ్చబొట్టు ఉంది.పోలీస్ ఫోటో గ్రాఫర్లు, వేలిముద్రల నిపుణుల్ని పిలిపించాడు ఇన్‌స్పెక్టర్. వాళ్ళు తమ పనులు పూర్తిచేసుకెళ్ళిపోయారు.పార్కు సిబ్బంది అందరినీ పిలిపించి విచారించాడు ఇన్‌స్పెక్టర్ ప్రతాప్‌సింగ్. ఎవరూ ఆమెను గుర్తుపట్టలేదు. దాంతో శవాన్ని పోస్ట్‌మార్టంకి తరలించాడు. తన పోలీస్టేషన్ పరిధి, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా యువతి తప్పిపోయినట్టు ఎక్కడైనా ఎఫ్.ఐ.ఆర్ నమోదైందా? అనే విషయం ఎంక్వైరీ చేశాడు ఇన్‌స్పెక్టర్ ప్రతాప్‌సింగ్. అలాంటి దాఖలాలు కనిపించలేదు.
చేతిమీద పచ్చబొట్టే మృతురాల్ని గుర్తించడానికున్న ఏకైక మార్గం.సామాన్యంగా స్త్రీలు భర్త పేరు పచ్చబొట్టుగా వేయించుకుంటారు. అయితే ఆ యువతి చేతి మీద ఎం.సింగ్ అనే పచ్చబొట్టు స్పష్టమైన క్లూ కాదు. ఎం.సింగ్ అంటే మిల్కాసింగ్, మదన్‌సింగ్, మహేంద్రసింగ్, మోహన్‌సింగ్ ఎవరైనా కావచ్చు. మరి గుర్తించటం ఎలా?కేసును ఎలా దర్యాప్తు చెయ్యాలో అర్థంకాక తల పట్టుకున్నాడు ప్రతాప్‌సింగ్.అన్ని పోలీస్‌స్టేషన్‌లకు సూచనలు ఇచ్చాడు. అయినా కేసు ఒక్క అంగుళం ముందుకు కదల్లేదు.