తన ఎదురుగా ఓ ఫైలు ఉంచిన వ్యక్తివైపు కళ్ళెత్తి చూశాడు డిటెక్టివ్ శరత్.‘‘నమస్కారం, నా పేరు నాగభూషణం’’ అంటూ శరత్ ఎదురుగా కూర్చున్నాడు అతడు.అతడు టేబుల్‌పై ఉంచిన ఫైలు తెరిచాడు శరత్.
అది ప్రొఫెసర్ ప్రసాద్ మరణానికి సంబంధించిన వార్త ఉన్న పేపర్ల కటింగులున్న ఫైలు.ఫైలులో వార్తలు చదివాడు శరత్.ప్రొఫెసర్ ప్రసాద్ పనిమీద కారులో విజయవాడ వెళ్తున్నాడు. కోదాడ దాటినతరువాత హఠాత్తుగా అతని కారుకు నిప్పంటుకుంది. డ్రైవర్ అతి కష్టంమీద బయటపడ్డాడు. ప్రసాద్‌ని బయటకు లాగాలని చూశాడు. కానీ ప్రసాద్ కూర్చున్నవైపు డోర్ ‘చైల్డ్ లాక్’లో ఉంది. దాంతో అతను తలుపు తీయలేకపోయాడు. ఈలోగా కారు మొత్తం మంటల్లో దగ్థమైపోయింది.పరిశోధనలో తెలిసిందేమిటంటే ప్రసాద్ బాగా తాగి ఉన్నాడు. స్పృహలోలేడు. కారులో మంటలు రాజుకున్నప్పుడు అతను సరిగా స్పందించలేకపోవటానికి అదికూడా ఒక కారణం అని తెలిసింది.
హైవేపక్కన సర్వీస్‌రోడ్డులో ఉన్న ‘బార్’లో అతను తాగటం, ఇంకొన్ని బాటిల్స్ కొనటం, డ్రైవర్ అతడిని దాదాపుగా స్సృహలేనిస్థితిలో నడిపించుకుపోవటం చూసిన సాక్షులున్నారు. షార్ట్‌సర్క్యూట్‌వల్ల కారుకునిప్పు అంటుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. వివరాలు చదివి తలఎత్తి నాగభూషణంవైపు ప్రశ్నార్థకంగా చూశాడు శరత్.‘‘నేను ప్రొఫెసర్‌ని. నేను ప్రసాద్‌తో కలిసి పనిచేసేవాడిని. నాకు ప్రసాద్ బాగాతెలుసు.
అతనికి తాగే అలవాటులేదు. మద్యం ముట్టడు. కనీసం సిగరెట్ తాగడు. ఇది ప్రసాద్‌తో పరిచయం ఉన్న వాళ్లందరికీ తెలుసు’’.కనుబొమ్మలెగరేశాడు శరత్.‘‘నాకు ఆశ్చర్యం కలిగించిన అంశం ఇదే. కానీ అతని భార్య భవాని కూడా అతడు ఇటీవలనుంచీ తాగటం ప్రారంభించాడని చెప్పటం ఆశ్చర్యం కలిగించింది. అనుమానం కలిగిస్తోంది. మీరు ఒకసారి విషయం పరిశోధించి అదేమిటో నిగ్గు తేల్చాలి’’ అన్నాడు నాగభూషణం.