‘ఇది చాలా సులభమైన కేసు అనుకున్నాను. కానీ అంతు తేలటం లేదు’ డిటెక్టివ్ శరత్ ముందు నిస్త్రాణగా కూలబడుతూ అన్నాడు ఇన్‌స్పెక్టర్ విజయ్.‘ఏ కేసు?’ అడిగాడు శరత్.
‘అదే ఎనిమిదేళ్ల అమ్మాయి రేప్ అండ్ మర్డర్ కేసు’శరత్‌కు ఆ కేసు గుర్తు వచ్చింది.సంచలనాత్మకమైన కేసు.షర్మిల అనే ఎనిమిదేళ్ల పాప ఇంటి బయట స్నేహితులతో ఆడుకుంటూ ఉన్నది. కాస్సేపటికి వాళ్ల అమ్మ వచ్చి చూసేసరికి, ఇతర పిల్లలు ఉన్నారు. కానీ షర్మిల కనిపించలేదు.‘షర్మిల ఏది?’ అని అడిగితే ‘అంకుల్ చాక్‌లేట్ కొనిస్తానంటే వెళ్లింది’ అని చెప్పారు పిల్లలు.‘ఏ అంకుల్? అంటే సరిగ్గా చెప్పలేకపోయారు. చుట్టూ ఉన్న దుకాణాలన్నిటిలో అడిగారు. ఎవరూ అమ్మాయిని కానీ అంకుల్‌ని కానీ చూడలేదు. బంధువులందరినీ అడిగారు. ఎవరికీ తెలియదు.దాంతో పోలీసు కంప్లయింట్ ఇచ్చారు. పోలీసులు ముందుగా ‘ట్రాఫికింగ్ కేసు’ అనుకుని పిల్లలను రాష్ట్రం దాటి అమ్మేసే గ్యాంగులన్నింటిపై నిఘా పెట్టారు. కానీ ఏమీ తేలలేదు.ఇంతలో పోలీసులకు ఓ వార్త అందింది.
నగరం పొలిమేరలలో ఉన్న చెత్త డంపింగ్‌యార్డు దగ్గరలో ఓ వ్యక్తి ఎనిమిదేళ్ల పాప శవాన్ని ఒళ్ళో పెట్టుకుని కూర్చున్నాడనీ, పాప శరీరమంతా గాయాలు ఉన్నాయని, హుటాహుటిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు.వాళ్లకి అందిన కబురు నిజమే!!ఓ రాక్షసుడిలా పొడుగ్గా, నల్లగా ఉన్న విద్యాగంధం లేని అనాగరికడు. ఒళ్లంతా దుమ్ము కొట్టుకు పోయి ఉన్నవాడు, ఓ పాప శవాన్ని పట్టుకుని ఉన్నాడు.పోలీసులు అతడిని అరెస్టు చేశారు.అతడి ఒళ్లో ఉన్న పాప షర్మిల అని తేలింది.అయితే పోలీసులు ఎంతగా ప్రశ్నించినా, ఎలా ప్రశ్నించినా అతడు నోరు మెదపటం లేదు.అందరూ అతడే నేరస్తుడు అంటున్నారు.
మీడియా అంతా కలియుగ రాక్షసుడు అని అతడే నేరం చేశాడని నిర్ణయించేశాయి. కానీ, ఇతడిని చూస్తే భాష తెలిసినట్టు లేదు. మాటలు వచ్చినట్టు లేవు. అతడి దగ్గర కట్టుకున్న గుడ్డలు తప్ప, అవీ సరిగ్గాలేవు. పైస లేదు. అతడు పాపని చాక్‌లేట్ కొనిస్తానని మాయచేసి తీసుకు వచ్చాడని ఊహించటం కూడా కష్టంగా ఉంది. అందరిలాగా అతడే నేరస్తుడని చేతులు దులిపేసుకోవాలనిపించటం లేదు’ విజయ్ స్వరంలో ఆవేశం, నిస్పృహలు తెలుస్తున్నాయి.