అర్ధరాత్రి నడుచుకుంటూ వచ్చి తలుపు కొట్టాడు బంటీ. సరిత తలుపు తీసింది. అతడి చేతిలో రైఫిల్‌ని చూసి, గుసగుసగా ‘ఆ రూము... అటు ఇంకో రూము’ అని చూపించింది. మొదటి రూంలోకెళ్ళాడు బంటీ. గాఢనిద్రలో ఉన్నాడు సరిత భర్త. రైఫిలెత్తి ఒక్క పెట్టున కాల్చేశాడు అతణ్ణి. పక్క రూంలో కెవ్వుమన్న కేక విని, వెళ్లి చూసి అత్తగార్నీ కాల్చేశాడు. సరిత చేయి పట్టుకుని, ‘పద!’ అన్నాడు. అతడితో అడుగులేసింది సరిత.

********

హరిద్వార్‌, హృషికేశ్‌, నైనిటాల్‌, మనాలి, సిమ్లా తిరిగేస్తూంటే జీవితం కలలాగా ఉంది ఇద్దరికీ. మళ్ళీ కలుస్తామనుకోలేదు. ఇలా హనీమూన్‌ జరుపుకుంటామనుకోలేదు. చేసిన రెండు హత్యలు వాళ్ళ ఆనందాలకేమీ అడ్డురావడం లేదు. పాతికేళ్ళ బంటీ, 22 ఏళ్ల సరిత పెళ్లి చేసుకుని హనీమూన్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. బంటీకిది రెండో పెళ్లి, సరితకు మూడో పెళ్లి.‘‘ఇప్పుడు మనల్ని ఎవరు విడదీసినా వాళ్ళకి చావే, మనకింకో పెళ్ళే! ఏమంటావ్‌?’’ అంటున్న బంటీని చూసి కిలకిలా నవ్వి- ‘‘ఈసారి పట్టుకుంటే విడాకులకు ఒప్పుకోవద్దు మనం’’ అంది సరిత. బంటీ జేబులోంచి కత్తి తీసి చూపిస్తూ, ‘‘దీంతో ఐపోతారు మన జోలికొస్తే’’ అని కర్కశంగా చెప్పాడు.‘‘ఇదెక్కడిది? చెకింగ్స్‌లో ప్రాబ్లమవుతుంది, పారేయ్‌!’’ అని లాక్కుని దూరంగా విసిరేసింది. వెళ్లి తెచ్చుకుని- ‘‘పిచ్చిదానా, మనం పారిపోయిన లవర్సా ఇప్పుడూ? పరారైన కిల్లర్స్‌, గుర్తుంచుకో!’’ అని హెచ్చరించాడు.‘‘ఇలా భయపెట్టే మాటలు చెప్పకు బాబూ’’ అంది అల్లుకుపోతూ. కారు చీకట్లో కాటేజీ నిట్టూర్పులతో వేడెక్కుతోంది...

*******

‘‘ఏంటీ, తిని పడుకుంటే వాడు దొరుకుతాడా? పోలీసులు పట్టుకునేలోగా వాణ్ణి పట్టుకో, దాని మొగుణ్ణి చంపి దాంతో లేచిపోయాడు వాడు’’ అంటున్న భార్య మీద విసుక్కున్నాడు బంటీ తండ్రి వసంత్‌ సింగ్‌- ‘‘వాడిప్పుడు హంతకుడు! అప్పుడు వాణ్ణి పరువు కోసం పట్టి తెచ్చాం, ఇప్పుడేమని తెస్తావే? ఊస్తారు జనాలు’’.హర్యానాలోని సోనేపట్‌లో నెల రోజుల క్రితమే ప్రేమించిన సరితతో పారిపోయి పెళ్లి చేసుకున్న కొడుకు బంటీని, వెతికి పట్టుకుని విడాకులిప్పించారు. సరితకు వేరే పెళ్ళయిపోయింది. పెళ్ళయిన వారానికే సరిత భర్తనీ అత్తగార్నీ చంపేసి మళ్ళీ సరితతో పారిపోయి పెళ్లి చేసుకున్నాడు!