బర్త్ డే కేక్, కత్తి,విస్కీ, బీరు బాటిల్స్, టిష్యూ పేపర్ బాక్స్, రెండు లాప్టాప్స్, ఒక ఆన్సర్ షీట్, ఒక నగ్న మృతదేహం... చూస్తూ నిలబడ్డాడు సిమ్లాఎస్పీ శర్మ.
తల మీద బీరు బాటిల్ పెట్టి కొట్టినట్టుంది, తల పగిలిపోయింది. గొంతుని, మణికట్టుని కత్తితో తెగ్గోసే ప్రయత్నం చేసినట్టు కనపడుతోంది. బెడ్ మీద అంతా రక్తం. హోటల్ రిజిస్టర్లో ‘స్తుతి’ అని పేరు రాయించింది. టిష్యూ పేపర్ బాక్స్ మీద ‘ప్రగతి’ అని రాసింది. హోటల్ రిజిస్టర్లో ఈమెతో పాటు వచ్చినతని పేరు గౌరవ్ వర్మ. ఇతను పరారయ్యాడు... క్లూస్ టీం రంగంలోకి దిగింది. అక్కడే విచారణ జరుపుతూ ఎస్పీ శర్మతో పాటు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏఎస్పీ మదన్ లాల్ ఉన్నాడు. క్లూస్ టీం లాప్ టాప్స్‌కి క్లియరెన్స్ ఇచ్చేలోగా, మదన్ లాల్ హోటల్ రిజిస్టర్ని ఆశ్రయించి వేగంగా చర్యలు తీసుకున్నాడు. రిజిస్టర్లో ఉన్న ప్రకారం యూపీలోని గోండా జిల్లా మనక్పూర్ గౌరవ్ సొంతూరు. అక్కడి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు.
గౌరవ్ అక్కడికి చేరుకోలేదని సమాచారమొచ్చింది. తర్వాతి లీడ్ ఆన్సర్ షీట్. ఇది గౌరవ్ రాసిందే. రూర్కీ ఐఐటీ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆన్సర్ షీట్. హోటల్లోనే ఉన్న ఒక గెస్ట్‌ని, రూర్కీ ఐఐటీ వెబ్ సైట్‌ని యాక్సెస్ చేయమన్నాడు మదన్‌లాల్. వెబ్సైట్లో గౌరవ్ చదువుతున్న కోర్సు, సంవత్సరం నిర్ధారించుకుని, ఫేస్బుక్లో సెర్చ్ చేయమన్నాడు. ఫేస్బుక్లో ఎందరో గౌరవ్వర్మల మధ్య తనకు కావాల్సిన గౌరవ్ వర్మని క్వాలిఫికేషన్స్ ఆధారంగా పట్టుకున్నాడు. ఇంటర్నెట్ సిగ్నేచర్ కూడా ఉంది. కొన్ని క్షణాలు అతడి ఫోటో కేసి చూస్తూండి పోయాడు...గౌరవ్ ఫ్రెండ్స్ లిస్టుని చూసుకుంటూ వెళ్లి, ప్రగతీ టిబ్బర్వాల్ దగ్గర ఆగాడు.
ఫోటో కలుస్తోంది.... ఆమె ఢిల్లీ ఐఐటీ, టెక్స్ టైల్ ఇంజనీరింగ్.విషయం తెలుసుకున్న ఎస్పీ శర్మ, నిమిషాల్లో గౌరవ్, ప్రగతిల ఐఐటీల్ని కాంటాక్టు చేసి వాళ్ళ కుటుంబాల, స్నేహితుల వివరాలు సేకరించాడు. క్లూస్ టీం క్లియరెన్స్ ఇచ్చాక, ప్రగతి లాప్టాప్ తెరిచాడు మదన్ లాల్. స్ర్కీన్ సేవర్‌గా ప్రగతి, గౌరవ్‌లు కలిసున్న అందమైన ఇమేజి దర్శనమిచ్చింది. గౌరవ్ సెల్‌ఫోన్‌ని ట్రాక్ చేయడం మొదలెట్టారు. హత్య చేసిన తర్వాత చండీఘడ్ రూట్లో వెళ్ళాడు. తర్వాత రూర్కీ బాట పట్టాడు. ఆ తర్వాత, ఇప్పుడు ... సాయంత్రం హరిద్వార్ ట్రైనులో భటిండా పోతున్నాడు... జగధీరీ స్టేషన్‌కి రైలు చేరుకోగానే రైల్వే పోలీసులు గుర్తు పట్టి పట్టేసుకున్నారు, ఎస్పీ శర్మ ఇచ్చిన సమాచారంతో.