బాక్సులో ఉన్న దాన్ని గర్వంగా చూపిస్తూ, ‘‘దీని వయసు నాలుగు వందల ఏళ్ళు. రేటు ఎనిమిది కోట్లు. అంతకి తగ్గేది లేదు’’ అని చెప్పేశాడు బ్యాంక్ మాజీ మేనేజర్ ఉదయరాజ్. ఆసక్తిగా చూశాడు నగల వ్యాపారి మోహన్. దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఉదయరాజ్ వైపు చూశాడు. చూసి చూసి చటుక్కున దాన్ని బాక్సులో పెట్టుకుని పరుగెత్త సాగాడు. కేకలుపెడుతూ వెంటపడ్డాడు ఉదయరాజ్, వజ్రాభరణం కోసం... ‘‘ఇలా ఇంకోసారి దీన్ని అమ్మే ప్రయత్నం చేయకండి!’’ అని హెచ్చరించాడు ఇన్‌స్పెక్టర్ బి.బి అశోక్ కుమార్ ఆ వజ్రాభరణాన్ని, ఉదయరాజ్‌కి తిరిగి అందిస్తూ.
ఎనిమిదేళ్ళ తర్వాత...27 ఏళ్ల ఎంబీఏ గ్రాడ్యుయేట్ మధుసూదన్ బయట గొడవపడుతున్నాడు. ఒక మల్టీ నేషనల్ ఫైనాన్స్ కంపెనీ ఫ్రాంచైజీగా డిపాజిట్లు సేకరించిన అతను, కంపెనీ దివాలా తీయడంతో చిక్కుల్లో పడ్డాడు. డిపాజిటర్లు వచ్చి మీద పడ్డారు. రోజూ వాళ్లకి సర్ది చెప్పలేక పోతున్నాడు ఆర్మీ రిటైర్డ్ కెప్టెన్ అయిన అతని తండ్రి కూడా. ‘‘ఒరేయ్, ఏం చేసుకుంటావో చేసుకో. ఇంటి మీదికి ఇంకెవరూ రావడానికి వీల్లేదు!’’ అని తేల్చి చెప్పేశాడు కొడుకుతో.తీవ్రాలోచనలో పడ్డాడు మధుసూదన్. ఈ మైసూరులో ఇక వుండే పరిస్థితి లేదు.
అప్పుడు ఐటీఐ చదివిన అభిషేక్ వచ్చి, పేపర్లో ఒక యాడ్ చూపించాడు. ‘‘ఈ రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ డైమండ్ నెక్లెస్ అమ్మకానికి పెట్టాడట. కొని అమ్మితే నీ అప్పులు తీరతాయేమో...’’‘‘కొనడానికి డబ్బులేవిరా!’’ చిరాగ్గా అన్నాడు మధుసూదన్. బుర్రగోక్కున్నాడు అభిషేక్, ‘‘చూసి వద్దామన్నా. చూసి వస్తే దాని మహత్యంతో డబ్బు లెక్కడ్నుంచైనా రాలి పడొచ్చు!’’ అన్నాడు.‘‘రాలిపడ్తే అప్పులే తీర్చచ్చురా!’’మధుసూదన్ మాటలకి తలపట్టుకున్నాడు అభిషేక్.
‘‘ఏజ్ 408 ఇయర్స్, వేల్యూ 18 క్రోర్స్’’ కరాఖండీగా చెప్పేశాడు ఉదయరాజ్ దాన్ని ఊపుతూ. ఎంబీఏ చదివినశ్రీధర్, బీబీఎం చదివిన అమిత్, బీకాం చదివిన సతీష్, లా చదువుతున్న దిలీప్, సెవెన్త్ చదివిన కిరణ్, కాల్‌సెంటర్లో పనిచేస్తున్న బిట్టూ ఎగబడి చూడసాగారు. నగల వ్యాపారి రాం శరణ్ దాన్ని చేతిలోకి తీసుకున్నాడు.‘‘ఫోటో బావుంది, ఇక పీస్ చూపిస్తారా?’’ అన్నాడు మధుసూదన్. ఉదయరాజ్ ఫోటో తీసేసుకుని, ‘‘డీల్ ఒకే అయ్యాకే పీస్ ...నో చెక్, ఓన్లీ క్యాష్’’ అనేశాడు. ముందు పీస్‌ని చూసి విలువ కట్టాలన్నాడు రాంశరణ్. ఉదయరాజ్ తన భార్య సుశీలమ్మని పిల్చి, వీళ్ళకి కాఫీలిచ్చి పంపమని లేచి వెళ్లి పోయాడు.