ఉదయం ఏడుగంటల సమయం...ఉత్తరప్రదేశ్‌లోని బడౌత్ పోలీస్‌స్టేషన్...ఇన్‌స్పెక్టర్ మనోహర్‌సింగ్ ఏదో పనిమీద ఆ సమయానికే స్టేషన్ చేరుకున్నాడు.ఆయన కుర్చీలో కూర్చోబోతుండగా ఓ వ్యక్తి హడావుడిగా స్టేషన్‌లో అడుగుపెట్టాడు.ఆయాసంతో రొప్పుతున్నాడు.బహుశా చాలాదూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి ఉండాలి లేదా పరుగు పరుగున వచ్చి ఉండాలి అని అనుకున్నాడు ఇన్‌స్పెక్టర్ మనోహర్‌సింగ్.ఇన్‌స్పెక్టర్ మనోహర్‌సింగ్ ఆ వ్యక్తి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.
‘‘సార్ ఘోరం జరిగిపోయింది. ఎవరో మా అన్నను హత్యచేశారు’’ అని గద్గదస్వరంతో అన్నాడు.హత్య అనే మాట వినగానే ఇన్‌స్పెక్టర్ మనోహర్‌సింగ్ ఉలిక్కిపడ్డాడు.తను ఈ స్టేషన్‌లో డ్యూటీలో చేరినప్పటి నుంచి చాలావరకు నేరాలు అదుపుచేశాడు. అలాంటప్పుడు ఇప్పుడు ఏకంగా హత్య అంటే? ఇది తమ పోలీసులకే సవాల్‌గా అనిపిం చింది.ఇన్‌స్పెక్టర్ మనోహర్‌సింగ్ ఆ వ్యక్తిని కూర్చోబెట్టి గ్లాసు నీళ్ళు ఇచ్చాడు. ఆ వ్యక్తి నీళ్ళు తాగి కాస్త సేదతీరాక అతడి నుంచి హత్య ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? శత్రువులు ఎవరైనా ఉన్నారా? మొదలైన వివరాలు రాబట్టాడు.ఆ వచ్చిన వ్యక్తి తన పేరు రమేశ్ అని, పక్కనే గల కోతానా గ్రామంలో తన సోదరుడు భాస్కర్ కిల్లీ కొట్టు నడుపుతుంటాడని, నిన్న రాత్రి అతను కిల్లీకొట్టు ముందు నిద్రపోతుండగా ఎవరో కత్తులతో పొడిచి చంపేశారని చెప్పాడు.ఇన్‌స్పెక్టర్ మనోహర్ సింగ్ కేసు నమోదు చేసుకుని వెంటనే తన సిబ్బందిని వెంట బెట్టుకుని ఘటనాస్థలికి చేరాడు.
అప్పటికే ఘటనాస్థలం దగ్గర జనం గుమిగూడి ఉన్నారు.జనాన్ని పక్కకు తప్పించి ఇన్‌స్పెక్టర్ మనోహర్‌సింగ్ శవాన్ని క్షుణ్ణంగా పరిశీలించాడు.మృతుని వయసు ముప్ఫయి ముప్ఫయి ఐదు మధ్య ఉంటుంది. శవం వెల్లికిలా పడిఉంది. శరీరం మీద అనేకచోట్ల కత్తిపోట్ల గుర్తులు కనిపిస్తున్నాయి. వాటి ద్వారా స్రవించిన రక్తం నేల మీద గడ్డకట్టి ఉంది. శవం పక్కనే నులక మంచం ఉంది. నేల మీద ఉన్న పరుపు అస్త వ్యస్తంగా ఉంది.అది చూసి ఇన్‌స్పెక్టర్ మనోహర్‌సింగ్ కనుబొమ్మలు ముడిపడ్డాయి.తరువాత భాస్కర్ అంగట్లోని వస్తువులను పోలీసులు తనిఖీచేశారు. ఏదైనా నిషిద్ధ వస్తు వులను అతను అమ్ముతున్నాడా? ఆ క్రమంలో అతని హత్య జరిగిందా? లేదా దొంగతనం జరిగిందా? దొంగతనం కోసం వచ్చిన వాళ్ళు హత్య చేసి ఉండొచ్చా? అనే అనుమానంతో.