అతని భార్య చనిపోయి మూడు నెలలైంది. దాంతో బాగా కుంగిపోయాడతను. తిండీ నిద్రా కరువయ్యాయి. విచారంతో చిక్కి శల్యమైన కొడుకుని చూసి తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. అతన్ని మళ్ళీ పెళ్ళి చేసుకోమన్నారు. ససేమిరా అన్నాడతను. జీవితంలో ఇంకే కోరికలు లేవన్నాడు. ఇంతలోనే అనుకోని మలుపు. మరి ఆ మలుపుల వెనుక ఉన్న పాత్రలు ఎవరు? ఏమిటా మిస్టరీ?
రాత్రి పదకొండు గంటల సమయం.చుట్టూ చిక్కటి చీకటి కమ్ముకుని ఉంది.భయంకరమైన నిశ్శబ్దం వాతావరణానికి భయపు రంగును పులుముతోంది.సరిగ్గా అదే సమయంలో ఇద్దరు వ్యక్తులు బాలానగర్‌కు దారితీసే జి.టి.రోడ్ గుండా కబుర్లు చెప్పుకుంటూ వెళుతున్నారు. వారి మాటలుతప్ప మరెలాంటి అలికిడీ లేదు.ఇద్దరూ జి.టి.రోడ్ టర్నింగ్ సమీపించారు.రోడ్డు పక్కన రెండో కిలోమీటర్ రాయి దిష్టిబొమ్మలా నుంచుని ఉంది.హఠాత్తుగా వారిద్దరిలో ఓ వ్యక్తి మెరుపులా కదిలాడు.బొడ్లో దాచుకున్న కత్తిని సర్రున లాగి పక్కనే నడుస్తున్న వ్యక్తి మీదికి దూకాడు.మరుక్షణం నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ కెవ్వుమని కేక వినిపించింది.పొట్టలోకి దింపిన కత్తిని బయటికి లాగి ఆ వ్యక్తి ఏడెనిమిది సార్లు పొడుస్తూ ఉండిపోయాడు.గాయపడిన వ్యక్తి బాధతో మెలికలు తిరుగుతూ కిందపడి, గిలగిలా తన్నుకున్నాడు.
కాసేపటికి అతని శరీరం రక్తపు మడుగులో నిర్జీవంగా మిగిలిపోయింది.ఆ తరువాత రక్తసిక్తమైన కత్తిని మృతుడి దుస్తులకే తుడిచి, కత్తిని బొడ్లో దోపుకున్నాడు.మృతశరీరాన్ని బరబరా ఈడ్చుకుంటూ వెళ్ళి, కొత్తగా తవ్విన గోతిలోకి తోశాడు. గోతిని మట్టితో పూడ్చేశాడు. హాయిగా ఓ నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి చీకట్లో కలిసిపోయాడు. సమయం రాత్రి పన్నెండు గంటలైంది.మిర్జాపూర్ పోలీస్‌స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ అనిల్ మిశ్రా డ్యూటీలో ఉన్నాడు.ఆ సమయంలో ఓ వ్యక్తి హడావుడిగా పోలీస్‌స్టేషన్‌లోకి వచ్చాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది.
‘‘సార్! జి.టి.రోడ్డు టర్నింగ్‌లో ఓ హత్య జరిగింది. నా కళ్లారా చూశాను. హంతకుడిని నేను గుర్తుపట్టగలను’’ అన్నాడు.సబ్ ఇన్‌స్పెక్టర్ అనిల్ మిశ్రా ఆ వ్యక్తిని కూర్చోబెట్టి, అన్ని వివరాలు రాబట్టాడు.ఆలస్యం చేయకుండా తన సిబ్బందిని వెంటబెట్టుకుని ఘటనా స్థలానికి చేరుకున్నాడు. గోతిలో కప్పెట్టిన శవాన్ని బయటికి తీయించాడు. చుట్టుపక్కల ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. తరువాత జీపులో బాలానగర్‌కు దగ్గర్లోని ఖోంఖ్యా గ్రామానికి బయలుదేరాడు.