తెల్లారే ఆదరాబాదరా పొడుచుకొచ్చి గంగాజలాలకి బంగారుపూత పూసేస్తున్నాయి సూర్యకిరణాలు. మునకలేస్తున్న ఒక తల ఆ బంగారుపూతని మలినం చేస్తున్నట్టుంది. అవి పుష్కరాలు కావు, ఏ పుణ్య దినమూ కాదు. పుణ్యం కోసం కాదు, భక్తితోనూ కాదు. అతను కడిగేసుకుంటున్నాడు... బాగా కడిగేసుకుని, ఒడ్డున ఉన్న బట్టలు నదిలోకి విసిరేశాడు. సెల్ ఫోన్‌ని నిమజ్జనం చేశాడు. అప్పుడు చూసుకుంటేవేలికి ఉంగరం లేదు.
ఏమయ్యింది ఉంగరం? కంగారుపడి నీళ్ళలోకి చూశాడు...పోలీసుల దగ్గరుంది ఉంగరం.దాన్నే చూడసాగాడు ఇన్‌స్పెక్టర్ బోస్... ‘కొత్తోడే! పాతోడైతే పారేసుకోడు’ అనుకుంటూ.ఫ ఫ ఫఎంతో వయ్యారంగా తను పనిచేస్తున్న మున్సిపల్ ఆఫీసుకి బయల్దేరింది మనువా మజుందార్. ఆమెకివ్వాళ చాలా తృప్తిగా వుంది. ఇన్‌స్పెక్టర్ బోస్ నుంచి కాల్ రాగానే కంగారుపడి వెళ్లి చూసింది. ప్రపంచం బద్దలైనట్టు ఏడ్పు లంకించుకుంది. ఉంగరం చూపిస్తే దాన్ని లాక్కోబోయింది- ‘ఎక్కడున్నావ్ నిన్న?’ అడిగాడు బోస్. నిన్న సాయంత్రమనగా తల్లిగారింటికి వెళ్లి, అక్కడ్నించే ఇవ్వాళ ఆఫీసుకి వెళ్ళానంది. ఆ మధ్య మొదటి పెళ్లిరోజుకి అనుపమ్‌కి బహుమతిగా ఇచ్చిన ఉంగరమని భోరుమంది. వాలంటైన్స్ డే పిక్నిక్ వీడియోలో చాలా హ్యాపీగా ఉన్నారిద్దరూ. ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రశంసల జల్లు కురిపించుకున్నారు.
మనువా ఫ్రెండ్స్‌కి చెప్తోంది - అనుపమ్ తనని ఎంత ప్రేమగా చూసుకుంటాడో, తన పేరెంట్స్‌ని ఎంత గౌరవిస్తాడో, అతడి ఫ్యామిలీతో కూడా తానెంత బాగా అడ్జెస్ట్ అయ్యిందో...‘‘ఏయ్ అనుపమ్, నీ సంగతి చూస్తా!’’‘‘ఏంటిది మనూ? డబుల్ యాక్షన్ ఆపుతావా - బయట ఒకలా, నాతో ఒకలా?’’‘‘కొట్టానంటే బంగ్లాదేశ్‌లో పడతావ్!’’‘‘వెళ్లి పోయారు - నా వాళ్ళు బంగ్లాదేశ్ వెళ్లిపోయారు - ఇంకాపు!’’‘‘రాకుండా చూసుకో ఇంకోసారి, మందకి మంద వచ్చిపడితే ఊరుకోను!’’‘‘సరే, మనమే అప్పుడప్పుడు వెళ్దాంలే’’‘‘కోల్‌కతా వదిలి రాను. ఊఁ...ఇదిగో, పెట్టుకో. ఇవ్వాళ ఫస్టు పెళ్లి రోజని గుర్తుండి చచ్చిందా నీకూ?’’