ద్వారకా ఎక్స్‌ప్రెస్ వే మీద దూరంగా చిన్న వెలుగు... అది దగ్గరవుతూ దగ్గరవుతూ పూర్తిగా కమ్మేయడంతో చురకత్తుల్లా కసకస మెరిశాయి చీకట్లో దాగిన ఐదు జతల కసాయి కళ్ళు. కీచు శబ్దంతో దఢాల్న ఆగిపోయింది దూసుకొచ్చేసిన కారు. టకటక తుపాకీ మొనలు శబ్దాలు చేశాయి కారు మీద - ‘‘దిగు!’’ గద్దించిందో గొంతు. ‘‘దిగు!’’ గద్దించింది తుపాకీ గురిపెట్టి.
‘‘దిగుబే, దిగు!’’ ఇంకొన్ని గొంతులు.ఉన్నట్టుండి హెడ్‌లైట్స్ పడ్డంతో కన్ఫ్యూజై పేలడానికి రెడీ అయిపోయాయి తుపాకులు. మెరుపులా జిప్సీల్లోంచి దూకేశారు వాళ్ళు. ఢామ్మని పేలుడు- ‘‘చేతులెత్తండిబే సాలే!’’ ఖంగుమంది గొంతు. హఠాత్తుగా నిశ్శబ్దం. రివాల్వర్లోంచి వేడిగా పైకి లేస్తూ పొగ. కర్కశంగా గురుగ్రామ్ క్రైం యూనిట్-3 ఇన్స్పెక్టర్ మహేంద్ర సింగ్ చూపులు...ఆ చూపులు ఒక రహస్యాన్ని కనుక్కోలేకపోయాయి అప్పుడు...ఫ ఫ ఫమూడు నెలల క్రితం...నడుచుకుంటూ ఇంటికి పోతున్నాడతను సాయంత్రం ఆరున్నరకి. సెల్ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఎదురుగా హోండా యాక్టివా వస్తోంది. దగ్గరవుతోంది. పూర్తిగా దగ్గరవగానే ఢామ్మని పేలుడు. ఢాంఢామ్మని మళ్ళీ మళ్ళీ పేలుళ్ళు... ఐదు గుళ్ళతో అతణ్ణి నేలకూల్చి పరారయ్యారు ఇద్దరూ.
మూడు నెలల తర్వాత...నడుచుకుంటూ ఇంటికి పోతున్నాడతను సాయంత్రం ఆరున్నరకి. సెల్ఫోన్లో మాట్లాడుతున్నాడు. ఎదురుగా హోండా యాక్టివా వస్తోంది. దగ్గరవుతోంది. పూర్తిగా దగ్గరవగానే ఢామ్మని పేలుడు. మళ్ళీ మళ్ళీ పేలుళ్ళు... ఐదు గుళ్ళతో అతణ్ణి నేల కూల్చి పరారయ్యారు ఇద్దరూ.‘‘వాట్స్ దిస్? ఒకేలా ఇద్దరు కబడ్డీ ప్లేయర్స్...??’’‘‘నమ్మలేని నిజం సర్. మూడు నెలల క్రితం స్టేట్ లెవెల్ కబడ్డీ ప్లేయర్ దీపక్ కుమార్ ప్రాక్టీసు చేసుకుని ఇంటికి పోతున్నప్పుడు ఎలా చంపారో, అలాగే ఇప్పుడు ఇదే రోహతక్ జిల్లాలో, నేషనల్ లెవెల్ కబడ్డీ ప్లేయర్ సుఖ్విందర్ ప్రాక్టీసు చేసుకుని ఇంటికి పోతూంటే చంపారు. కాకపోతే... ఈసారీ... సీసీ టీవీ...’’ఛానల్స్‌లో వైరల్ అయిన ఆ ఫుటేజీని మళ్ళీ చూశాడు డీసీపీ బల్బీర్ సింగ్, ‘‘ఫ్రెండ్స్ మధ్య గొడవ మొదటి కేసు, వాళ్ళు దొరికారు. ఈ ఫుటేజీలో వీళ్ళెవరు ?’’‘‘వేరే సర్, సంబంధం లేదు. కానీ రెండూ అదే సమయంలో అవే పరిస్థితుల్లో అలాగే జరిగాయి కాకతాళీయంగా’’