‘బాస్ ప్రఖ్యాత గాయకుడు జీవన్‌లాల్ మిమ్మల్ని కలవాలని వచ్చాడు’ చెప్పింది సెక్రటరీ సుధ.‘జీవన్‌లాల్?’ ప్రశ్నార్థకంగా చూశాడు డిటెక్టివ్ శరత్.‘జీవన్‌లాల్ బాస్.. ఓ పోలీసు ఆఫీసరు బాగా అప్పులుచేసి ఇతడిని బెదిరించి డబ్బులు లాగా లనుకున్నాడు. మనం అతడి నాటకాన్ని భగ్నం చేసి పోలీసులకు పట్టించాం’ గుర్తుచేశాడు అసిస్టెంట్ రాము.శరత్‌కి గుర్తుకు వచ్చింది.
‘పంపించు’ అన్నాడు శరత్.కొద్దిసేపటికి లోపలకు వచ్చాడు జీవన్‌లాల్. శరత్ ముందు కూర్చున్నాడు.‘నాకో సమస్య వచ్చింది. మీరే పరిష్కరించాలి’ అన్నాడు ఉపోద్ఘాతం లేకుండా.‘ఏమిటా సమస్య?’ అడిగాడు శరత్.‘ఎవరో నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు? వారు తమ ప్రయత్నాలలో విజయం సాధించే లోగా మీరు వాడెవడో కనుక్కోవాలి’.‘మీకు ఎవరిమీదయినా అనుమానం ఉందా?’తల అడ్డంగా తిప్పాడు జీవన్‌లాల్.‘అనుమానం ఉండుంటే ఈపాటికి వాడి అంతచూసే వాడిని’ అన్నాడు.‘మీ కార్యకలాపాలు చెప్పండి. ఇంకా పాటలు పాడుతున్నారా?’‘లేదు. పాటలు మానేశాను. అయితే పాటలు పాడే వారికి శిక్షణనిచ్చేందుకు ఒక సంస్థను ఏర్పాటుచేశాను. దానిద్వారా యువగాయనీ గాయకులు తయారవుతున్నారు. ‘నా సంస్థకు మంచి పేరుంది’ గర్వంగా చెప్పాడు జీవన్‌లాల్.
‘మిమ్మల్ని చంపాలని ప్రయత్నిస్తున్నట్టు మీకు అనుమానం ఎందుకు వచ్చింది?’‘నేను ఓ రోజు లిఫ్టులో ఉన్నాను. లిఫ్ట్ బయలుదేరే చివరి క్షణంలో ఒకడు లిప్టులోకి వచ్చాడు. తలుపులు మూసుకోగానే కత్తితీశాడు. పొడవాలని ప్రయత్నించాడు. నా చేతిలోని బాగుతో వాడిని కొట్టాను. తరువాత ఫ్లోర్‌లో లిప్టు ఆగగానే వాడు నన్ను వెనక్కితోసి పారిపోయాడు. నేను కంప్లయింటు చేశాను. తీరా చూస్తే ఆరోజు లిఫ్టులోని సీక్రెట్ కెమెరాలను ఎవరో ‘ఆఫ్’ చేశారు.‘లిఫ్టు మీరు ఉండే ఫ్లాట్‌లోదా? ఆఫీసులోదా?’‘ఫ్లాట్ లోదే’‘ఇంకా?’‘నేను ఆఫీసు బయట కారులోంచి దిగుతుంటే పైనుంచి పెద్దకొమ్మవచ్చి దగ్గర పడింది.
అందరూ అరవటంతో నేను దూరం పరుగెత్తాను. లేకపోతే, కారుతో పాటు నేనూ పచ్చడి అయ్యేవాడిని. పొరపాటు ఎవరిదో ఎవరూ చెప్పలేక పోతున్నారు. అంతకుముందు వీచిన గాలి వల్ల కొమ్మ బలహీనమై ఉంటుంది. అప్పుడు విరిగి పడటం యాధృచ్ఛికం అంటున్నారు’ ఆలోచిస్తూ తల ఊపాడు శరత్.‘నిన్న మా డ్రైవర్ రాలేదు. ఆలస్యమౌతోందని నేను కారు తీశాను. కాస్త దూరం వెళ్ళి చేస్తే, బ్రేకు పని చేయటం లేదు. హ్యాండ్ బ్రేక్ విరిగిఉంది. అతికష్టం మీద కారు రోడ్డు డివైడర్‌కు కొట్టి ఆపాను. పెద్దనష్టం కలగలేదు. కానీ ఎవరో హత్య ప్రయత్నం చేస్తున్నారని అర్థమయింది’.