‘‘ఇక నేను బతకను, ఈసారి వస్తే నా శవమే వస్తుంది. తాతగారి పక్కనే నన్నూ సమాధి చెయ్యవా?’’కొడుకు మాటలకి ఠారెత్తి పోయాడు తండ్రి, ‘‘ఏంటి, ఏమైందిరా నీకూ?’’ అంటున్నా సమాధానం చెప్పకుండా ఆస్ర్టేలియా వెళ్ళిపోయాడుశామ్.
వెళ్ళిన మూడు రోజులకే వచ్చేసింది భార్య సోఫియా... కేరళలోని కరువల్లూరు గ్రామానికి... శామ్ శవపేటికతో... ఘోల్లుమన్నారు ఇంటిల్లిపాదీ!అసలేం జరిగిందని అడిగాడు తండ్రి. గుండెపోటుతో పోయాడని చెప్పింది సోఫియా. మెల్‌బోర్న్‌లో ఎవరో ముసుగు వ్యక్తి కత్తితో దాడి చేశాడనీ, అప్పటి నుంచీ భయపడుతున్నాడనీ చెప్పి ఏడ్చింది.అంత్యక్రియలు పూర్తి కాగానే, డ్యూటీలో జాయినవ్వాలని వెంటనే వెళ్ళిపోయింది.‘‘ఓహ్ గాడ్, వచ్చేశావా?’’ ఉద్రేకంగా అన్నాడు అరుణ్.‘‘మిస్ యూ డియర్, హగ్ మి టైట్!’’ అంది బలంగా అతణ్ణి కౌగిలించుకుంటూ సోఫియా. సోఫియాకు చిన్నప్పట్నుంచీ శామ్ తెలుసు. కలిసి పెరిగారు. కలిసి చర్చిలో కాయర్ పాడుకున్నారు. కలిసి చదువుకుని పెళ్లి చేసుకుందామనుకున్నారు. ఇంట్లో వ్యతిరేకిస్తే చచ్చిపోతానంది.
పెళ్ళిచేసుకున్నాక శామ్ ఒమన్ వెళ్ళిపోయాడు. సోఫియాకి మెల్ బోర్న్‌లో జాబ్ వచ్చాక, శామ్ కూడా అక్కడే జాబ్ చూసుకున్నాడు. అప్పుడు కన్పించాడు అరుణ్... సోఫియా, శామ్‌ల సహపాఠి. తిరిగి ఫ్రెండ్స్ అయిపోయారు ముగ్గురూ... ఇప్పుడు సోఫియా, శామ్‌లకి ఏడేళ్ళ కొడుకున్నాడు. అరుణ్ భార్యా, కొడుకూ కేరళలోనే ఉంటున్నారు.ఫ ఫ ఫచిలిపిగా డైరీ చూపించాడు అరుణ్. ఆసక్తిగా చూసింది అతణ్ణి విడిపించుకుంటూ... ‘‘నీ మీద నాకెంత ప్రేముందో వర్ణించాలంటే వేల పుస్తకాలు కావాలి...’ అని కవిత్వం రాశాడు అరుణ్.
భర్త డెత్ సర్టిఫికేట్ బ్యాంకులో సబ్మిట్ చేసి డిపాజిట్లు, ఇన్వెస్ట్‌మెంట్ సర్టిఫికెట్లూ తన పేరు మీద, కొడుకు పేరు మీద మార్పించుకుంది. కొత్త బట్టలు కొనుక్కుంది. అరుణ్‌తో కలిసి తిరుగుతోంది. ప్రతి కదలికా రికార్డు చేస్తున్నారు ఆరుగురు అండర్ కవర్ పోలీసులు. పక్కా మర్డర్ కేసు ఇది. చనిపోతున్నానని తెలియకుండా నిద్రలోనే చంపేశారు శామ్‌ని! గుండెపోటుతో చనిపోలేదు శామ్. విషప్రయోగమని తేలింది. అయితే విషప్రయోగం జరిపితే రాత్రంతా అతడి శవం పక్కనే సోఫియా ఎలా నిద్రపోయిందనేది అంతుతేలని ప్రశ్న.