అర్ధరాత్రి గుట్టు చప్పుడుగాకుండా సమాధి తవ్వుతున్నారు. సుకుమార టార్చి వేసి ఊపిరిబిగబట్టి చూస్తున్నాడు. ఆ వెలుగులో తమ్ముడు భాస్కర, డ్రైవర్ పొన్నప్పన్, ఫ్రెండ్ షాహో గునపాలతో తవ్వి మట్టి తీస్తున్నారు... శవపేటిక తగిలింది. దాన్ని తెరిచినప్పుడు, అందులో మృతదేహంమొహాన్నే తీక్షణంగా చూస్తూ సుకుమార-‘‘వీడా? వీడూ నేనూ సేమ్ టు సేమా?థూ!’’ అని తిట్టాడు.
బుర్ర గోక్కున్నాడు భాస్కర, ‘‘ఫోటోచూస్తే నీకు సరిపోయాడే?’’‘‘థూ! నీ... మూసేసి బయల్దేరండి!’’కేరళలో ఒక రహస్య కుట్ర రచిస్తున్నాడు సుకుమార. ఇంకో రాత్రి కరువట్ట ఊళ్లోంచి కారులో వెళ్తున్నప్పుడు సినిమాహాలు దగ్గర ఓ వ్యక్తి లిఫ్ట్ అడిగాడు. అచ్చు గుద్దినట్టు తనలాగే వున్న ఆ వ్యక్తిని చూసి నమ్మలేకపోయాడు. మిరకిల్స్ ఇలా జరుగుతాయా! తేరుకుని, ‘‘ఎక్కడికి వెళ్ళాలి?’’ అన్నాడు. ఆ వ్యక్తి చెప్పాడు. ‘‘పేరు తెలుసుకోవచ్చా?’’‘‘చాకో అండి, సినిమా రిప్రజెంటేటివ్ని’’‘‘ఒరేయ్! చాకో గారికి సీటివ్వండ్రా!’’కారెక్కించుకుని, ఆశ్చర్యపడి చూస్తున్నారతడ్ని భాస్కర, షాహో బ్యాక్ సీట్లో. దేవుడు పంపిన దూత అంటే ఇదేనేమో!‘‘అన్నా, దేవుడు మనవైపే ఉన్నాడు!’’ ఉత్సాహపడ్డాడు భాస్కర.‘‘ఐతే మనం కింగులమేరా!’’ తృప్తి చెందాడు సుకుమార.
వీళ్ళ మాటలేం అర్ధంగాక చూస్తున్నాడు చాకో. సుకుమార చెవిలో ఏదో చెప్పడం విని, స్పీడు పెంచాడు పొన్నప్పన్. సుకుమార బ్రాందీ బాటిల్లో రహస్యంగా ఈథర్ కలిపిస్తూ, ‘‘పెళ్లయిందా బ్రదర్?’’ అన్నాడు.‘‘అయింది సర్, వన్ ఇయర్ అయింది, త్వరలో ఫాదర్ని అవుతా’’ బాటిల్ అందుకుంటూ అన్నాడు చాకో. ముగ్గురూ చూస్తూంటే నెమ్మదిగా బ్రాందీ సిప్ చేయసాగాడు. సిప్ చేస్తూ అలా అలా భాస్కర్ ఒళ్ళో వాలిపోయాడు.‘‘అన్నయ్యా, బాగా చూసి ఫైనల్ చెయ్’’ అన్నాడు భాస్కర.చాకో మొహం మీద టార్చి వేసి, ‘‘ సేమ్ టు సేమ్’’ అన్నాడు సుకుమార.కారు చెరియనాడులో భాస్కర ఇంటికి చేరుకుంది.స్పృహలో లేడు చాకో. మెడకి తాడు బిగుసుకుంటోంది... జర్మనీలో సెల్ఫ్ ‘మర్డర్’ సీన్. ఇన్సూరెన్స్ ఫ్రాడ్. చేస్తే ఇలా చేసి డబ్బు సంపాదించాలి! ఆ జర్మన్ క్రైం న్యూస్ చదివినప్పట్నుంచీ మనసాగడం లేదు- ‘‘చూస్తారే ఇంకా? కానివ్వండి!’’ ఉద్రేకంగా అరిచాడు సుకుమార. భాస్కర, పొన్నప్పన్, షాహోలు పట్టుకుని ఉరితీసి చంపిన చాకో శవం దుబ్బుమని కింద పడింది. గబగబా బట్టలు విప్పేయసాగారు. విప్పేసి సుకుమారని చూశారు.