ఓ దారుణమైన హత్య జరిగింది. హంతకుడెవరో తెలియలేదు. అతని ఉద్దేశమూ తేలలేదు. సవాలుగా మారిన ఈ సమస్యని పరిష్కరించేందుకు అత్యాధునిక పరికరాలను రంగంలోకి దింపారు పోలీసులు. అవి ఓ అనూహ్యమైన నేరస్తుడిని కళ్ల ముందు నిలిపాయి...

తలుపు బాదేస్తున్నాడు కిషోర్‌. గట్టిగా పిలుస్తున్నాడు. కానీ ఎవరూ రావడం లేదు. బయట గడియ ఎవరు పెట్టారో అర్థం కావడం లేదు. రాత్రంతా మొద్దు నిద్రపోయాడు. రెండు నిమిషాలుగా బాదుతున్నా తీయడం లేదు. ఇంతలో ఒక్కసారిగా తెర్చుకుంది తలుపు. పక్కింటి కుర్రాడు కన్పించాడు. ‘నువ్వెలా వచ్చావ్‌?’ అన్నాడు. బయటి తలుపు తీసే వుందన్నాడు కుర్రాడు. ఒక్క ఉదుటున గదిలోంచి బయటికొచ్చి పక్క గదికేసి చూశాడు కిషోర్‌. లోపలికి అడుగుపెడుతూ బిగుసుకుపోయి ఒక్క కేకపెట్టాడు!పోలీసులు వచ్చి చూస్తున్నారు పరిస్థితిని. ‘ఏం చేస్తూంటావని’ అడిగారు కిషోర్‌ని. సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌నని చెప్పాడు ఏడుస్తూ.

గదిలో దృశ్యం భీకరంగా వుంది. ఏవైనా గొడవలయ్యాయా అనడిగారు. లేదన్నాడు. ‘దొంగతనం జరిగినట్టూ లేదే?’ అంటూ గదంతా పరిశీలించారు. బీరువా లాక్‌ చేసే వుంది.‘గొలుసు... గొలుసు పోయింది!’ అరిచాడు కిషోర్‌. అదోలా చూశారతడ్ని. ‘దొంగతనం కేసులా లేదబ్బా’ అన్నారు. క్లూస్‌ టీంని పిలిపించారు. పంచనామా మొదలెట్టారు. వీధిలో, కిషోర్‌ ఆఫీసులో, బంధువుల్లో అన్నిచోట్లా విచారించారు. వ్యక్తిగత కక్ష ఎవరికీ వున్నట్టు అన్పించలేదు. వేరే రాష్ట్రంలో ఉంటున్న కిషోర్‌ అక్క వచ్చి, బంగారు గాజులు కూడా పోయాయని చెప్పింది.‘టోటల్‌ 900 గ్రామ్స్‌ గోల్డ్‌ సర్‌!’‘ఎవరు తీసికెళ్తారమ్మా? చెప్పు నువ్వే!’నెల గడుస్తున్నా కేసు అతీగతీ లేకుండా పోయింది.

ఆగ్నేయ బెంగుళూరు డీసీపీ ఎంబి బోరలింగయ్య ఈ కేసుని ఛాలెంజిగా తీసుకున్నాడు. నెల గడిచినా కేసులో ఒక్క క్లూ కూడా దొరక్కపోవడాన్ని అంగీకరించ లేకపోయాడు. టెక్నాలజీ మీదే ఆధారపడకుండా, ఇన్ఫార్మర్లని రంగంలోకి దింపాడు. పోలీస్‌ ఇన్ఫార్మర్లు పాత నేరస్థుల మీద, కొత్త వ్యక్తుల మీద నిఘా వేసి కూపీ లాగసాగారు. ఇంతటితో ఆగకుండా తిరిగి ఫోరెన్సిక్‌ టీంని అభ్యర్థించాడు - మరోసారి క్షుణ్ణంగా క్లూస్‌ అన్వేషించమని. క్లూస్‌ టీం ఈసారి శకిమంతమైన మైక్రో ఫోకస్‌ ఎక్స్‌ రే జనరేటర్‌తో గదినంతా శోధించారు. అక్కడే రసాయన పరీక్షలు నిర్వహించారు. తర్వాత డీసీపీతో సమావేశమయ్యారు.