ఒక సామాన్య మధ్యతరగతి బీమా ఏజెంట్ కులభూషణ్ . దారుణహత్యకు గురయ్యాడు. ఇన్స్‌పెక్టర్ విజయ్ ఈ కేసును డిటెక్టివ్ శరత్‌కు అప్పగించాడు. కులభూషణ్ పరిష్కరించిన క్లెయిమ్స్‌లో నాలుగు కేసులు అనుమానస్పదంగా ఉన్నాయి. ఆ నాలుగు కేసుల్నీ శరత్, అతడి అసిస్టెంట్ రామూ ఇద్దరూ భిన్న కోణాల్లో పరిశీలించారు. చివరకు కులభూషణ్ హంతకులు పట్టుబడ్డారా? లేక వారి శ్రమ బూడిదలోపోసిన పన్నీరైందా?
‘ఇది చాలా సులభమైన కేసు అనుకున్నాను. కానీ చాలా కఠినంగా ఉంది’ డిటెక్టివ్ శరత్ ఎదురుగా కుర్చీలో కూలబడుతూ అన్నాడు ఇన్‌స్పెక్టర్ విజయ్.ప్రశ్నార్థకంగా చూశాడు శరత్.‘కఠినమైన కేసంటూ ఉండదు. పరిశోధనకు మనం సరైనకోణం ఎన్నుకోలేదని చెప్పు’ నవ్వుతూ అన్నాడు శరత్.‘ఇది కులభూషణ్ హత్యకేసు. ఎవరో కొట్టి చంపేశారు. ఎక్కడో చంపి పార్కులోని చెత్తకుండీలో పారేశారు. దుప్పటిలో చుట్టేసివుంది దేహం. కులభూషణ్ ఇన్సూరెన్స్ ఏజెంట్. పెళ్ళైంది. ఇద్దరు పిల్లలు. భార్య టీచరు. అతన్ని ఎందుకు చంపారో, ఎవరు చంపారో తెలియటం లేదు. ఆఫీసులో మంచి పేరుంది. పాలసీలు బాగా చేయిస్తాడట. టార్గెట్‌లు రీచ్ అవుతాడు. ఒక మధ్యతరగతి జీవి, ఇంత హింసాత్మక చావుకు గురైనా కారణం కనబడటం లేదు’ చెప్పాడు విజయ్.‘ఫోను కాల్ రికార్డ్స్, బ్యాంకు లావాదేవీలు గమనించావా?’ అడిగాడు శరత్.‘అన్ని వివరాలు ఫైలులో ఉన్నాయి.
అతని క్లైయింట్లు, అతను ఫోన్ చేసినవారు అందర్నీ ప్రశ్నించాను. క్లయింట్లే ఎక్కువమంది. బ్యాంకు బ్యాలెన్స్ హఠాత్తుగా పెరగడం, తగ్గడం ఏంలేదు. నేను చేయాల్సింది చేశా. నీ వల్ల అవుతుందేమో చూడు’ అని వెళ్ళిపోయాడు.విజయ్ వెళ్ళాక ఫైలుతీసి మొత్తం వివరాలన్నీ చదివి ఆలోచిస్తూ కూర్చున్నాడు శరత్. తర్వాత అసిస్టెంట్ రామును నిలిచి కేసు పైలు అందించాడు.‘ఇటీవల కులభూషణ్ కలిసిన క్లయింట్స్ అందర్నీ ప్రశ్నించు. అతను డీల్ చేస్తున్న క్లెయిమ్స్, కేసులు పరిశీలించి అందులో ఏదైనా అనుమానం వస్తే చెప్పు’’.‘ఇది నాకు పరీక్షా బాస్? ఈపాటికి నీ అనుమానితుల జాబితా తయారయిపోయి ఉంటుందిగా’ నవ్వుతూ అన్నాడు రాము.‘మనిద్దరి జాబితాలు పోల్చి ఫలితం ఏమొస్తుందో చూద్దాం’ అన్నాడు శరత్.