భార్యా భర్తా కనిపించడం లేదు. మొదట భార్య హత్యకు గురైంది. తర్వాత భర్త అదృశ్యమయ్యాడు. ఈ కేసు సంచలనం సృష్టించింది. పోలీసులు దర్యాప్తు చేశారు. భర్తనే ప్రధాన నిందితుడిగా భావించారు. కానీ ఇప్పుడు భర్త అదృశ్యమయ్యాడు. దారి మూసుకుపోయింది. చేసేదిలేక ఈ కేసును డిటెక్టివ్ శరత్‌కు స్వాధీనం చేశాడు ఇన్‌స్పెక్టర్ విజయ్. కేసు మొత్తం అధ్యయనం చేశాక శరత్ ఏం చేశాడు? హతకులు దొరికారా?
‘‘డిటెక్టివ్ శరత్... ఈ కేసు నీదే’’ అంటూ గదిలోకి వచ్చాడు ఇన్‌స్పెక్టర్ విజయ్.‘‘ఏ కేసు?’’ నవ్వుతూ అడిగాడు శరత్.‘‘అదే, అమృత హత్య కేసు’’ అన్నాడు ఫైలు శరత్‌కి ఇస్తూ.‘అమృత హత్య పెద్ద సంచలనం సృష్టించింది. ఆమె వ్యాపారవేత్త. ఫ్యాషన్ దుస్తుల తయారీ ప్రపంచంలో అమృతకు పెద్దపేరు. ఆమె భర్త గిరీష్ టెన్నిస్‌లో దేశంలో నెంబర్‌వన్ క్రీడాకారుడు. వాళ్లది ప్రేమ వివాహం. ఐదేళ్ళక్రితం పెళ్ళైంది. సాక్షుల కథనం ప్రకారం, కొన్ని నెలలుగా వాళ్ళమధ్య గొడవలు నడుస్తున్నాయి. హత్యకు ముందురోజు రాత్రి వాళ్ళమధ్య పెద్ద గొడవ జరిగింది.అర్థరాత్రి వరకు అరుపులూ, కేకలూ చుట్టుపక్కల వాళ్ళంతా విన్నారు.తెల్లారి మామూలుగానే ఇద్దరూ కలిసి వెళ్ళి ఎప్పుడూ తినే చోటే బ్రేక్‌ఫాస్ట్ చేశారు. చెకప్ కోసం ఆమెను డాక్టర్ దగ్గరదింపి అతడు గ్రౌండ్‌కి వెళ్ళాడు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నాడు.
రాత్రి గడిచినా భార్య ఇంటికి రాలేదు. ఫోను స్విచాఫ్! ఫ్రెండ్స్ కూడా తెలియదన్నారు. తెల్లారి పోలీసుల్ని ఆశ్రయించాడు. ఒక అనాథ శవం ఉంది గుర్తుపట్టండి అన్నారు. కానీ అది అమృతదే. షాక్ తిన్నాడు. గొల్లుమన్నాడు. మిమ్మల్ని ప్రశ్నించాలి, ఓసారి రండన్నారు పోలీసులు. అలాగే అన్నాడు. తర్వాత కనబడలేదు! పోలీసులు ఎంత వెతికినా దొరకలేదు.అతనే ప్రధానమైన అనుమానితుడు’ ఫైల్ చదివి విజయ్‌వైపు చూశాడు. ‘‘ఇప్పుడు గిరీష్‌ని పట్టుకోవాలి’’ అన్నాడు విజయ్. ‘‘అతడే హంతకుడని నిరూపించే ఆధారాలున్నాయా?’’ అడిగాడు శరత్.‘‘అమృత హాస్పిటల్‌లోపలికెళ్లలేదు. గిరీష్ ఆమెను హాస్పిటల్ దగ్గర దింపి వెళ్లటం చూసినవారున్నారు. గేటు దగ్గర సి.సి. కెమేరాల్లో ఆమె కనిపించింది. తర్వాత కెమెరా పరిధి దాటి వెళ్ళింది. సి.సి కెమెరాల్లో ఆమె డ్రెస్ వేరు. శవంపైన ఉన్న డ్రెస్ వేరు. ఆమెను గొంతు నులిమి చంపారని పోస్టుమార్టం రిపోర్టు!’’ విజయ్ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు శరత్.