తండ్రి తాగుబోతు. ఆ మత్తులో తల్లిని కొట్టి చంపేశాడు. జైలు నుంచి తిరిగొచ్చి కొడుకుమీదే పడి తింటున్నాడు. తల్లి కోరక మేరకు తమ్ముణ్ణి చదివిస్తున్నాడు అన్నయ్య. కుదరదంటాడు తండ్రి. వాణ్ణి కూడా పనిలోపెడితే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుందంటాడు. కుదరదంటాడు పెద్ద కొడుకు. రోజూ వాళ్ళ మధ్య ఇదే గొడవ. చివరకు తండ్రిని చంపేశాడు కొడుకు! కేసు క్లియర్‌గా ఉంది. కానీ మిస్టరీ ఎక్కడుంది? డిటెక్టివ్‌ శరత్‌ ఏం చేశాడు?

తండ్రిని చంపిన కొడుకు !తన గదిలోకి వచ్చిన ఆ పిల్లవాడి వైపు కుతూహలంగా చూశాడు డిటెక్టివ్‌ శరత్‌.బెరుకు బెరుకుగా శరత్‌వైపు చూస్తూ నిలుచున్నాడు ఆ పిల్లవాడు.‘‘మీ పెద్దవాళ్లు ఎవరూ రాలేదా?’’ అడిగాడు శరత్‌.ఇంతలో సెక్రటరీ సుధ లోపలకు వచ్చి ఆ పిల్లవాడిని కుర్చీలో కూర్చోబెట్టింది.‘‘బాస్‌. ఈ పిల్లాడి పేరు దత్తు. వీళ్ల అన్నయ్యపేరు అప్ప. మా ఇంట్లోనే పనిచేస్తాడు. నిరుపేదలు. చాలా మంచికుర్రాడు. కానీ తండ్రిని హత్యచేశాడన్న నేరం మీద పోలీసులు అప్పను అరెస్టు చేశారు. ఈ పిల్లాడు ఒంటరివాడయ్యాడు. వాళ్ల అన్నయ్య నిర్దోషి అని మీరు నిరూపించాలని అడుగుతున్నాడు’ గబగబా చెప్పింది సుధ.పిల్లవాడి వైపు చూశాడు శరత్‌. అతను చూడగానే తలదించుకున్నాడు.‘మీ అన్నయ్య అప్ప మీ నాన్నని హత్య చేయలేదా?’ మృదువుగా అడిగాడు శరత్‌.ఆ పిల్లాడు కన్నీళ్లతో తల అడ్డంగా తిప్పాడు.

అసిస్టెంట్‌ రాము వైపు చూశాడు శరత్‌.‘యెస్‌ బాస్‌’ అని బయటకు వెళ్లాడు రాము.‘ఇప్పుడీపిల్లాడు ఎక్కడ ఉంటున్నాడు?’ సుధను అడిగాడు శరత్‌.‘‘నా దగ్గరే బాస్‌’’‘‘సరే, కేసు నేను పరిశోధిస్తాను, పిల్లాణ్ణి ఇంటికి తీసుకువెళ్లు’’‘‘అన్న ఇంటికొచ్చేస్తాడా?’ ఆశగా అడిగాడు పిల్లాడు.ఆ లేత మనసులో అనవసరమైన ఆశలు కల్పించకూడదు. సుధవైపు చూశాడు శరత్‌. పిల్లాణ్ణి తీసుకుని సుధ బైటకు వెళ్లిపోయింది. ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కి ఫోన్‌ చేశాడు శరత్‌.‘‘ఆ! నేనే వస్తున్నాను’’ అన్నాడు విజయ్‌. శరత్‌ చెప్పింది విని, ‘‘అప్ప కేసేనా?’’ అంటూ పెదవి విరిచాడు విజయ్‌.‘‘ఏం? అలా అన్నావు?’’ అడిగాడు శరత్‌.‘‘వాళ్లనాన్న పెద్ద తాగుబోతు. తాగి భార్యను చంపేశాడు. సాక్ష్యాలు లేవు. కొన్నేళ్ల జైలుశిక్షతో బయటపడి, పిల్లల సంపాదనమీద పడి తింటున్నాడు. వాళ్లిద్దరినీ పనిలో పెట్టాడు. తమ్ముడిని చదువుమానిపించి పెద్దవాడే చదివిస్తున్నాడు. అది వాళ్ల నాన్నకి ఇష్టంలేదు. అదే వాళ్లిద్దరి మధ్య ఘర్షణ. అంతకుముందురోజు తండ్రీకొడుకులమధ్య పెద్ద వాదన జరిగిందట. అరుపులు. ‘‘చంపేస్తా’’ అని బెదిరించాడు అప్ప.

మర్నాడు కత్తి కొన్నాడు. మళ్ళీ రాత్రి గొడవ! పొడిచి పారిపోయాడు. పక్కగుడిసెవాళ్ళు బైటకొచ్చి చూస్తే, అప్ప పరుగెత్తుకెళ్ళిపోవటం కనిపించిందట. లోపలకెళ్లి చూస్తే, తండ్రి రక్తం మడుగులో ఉన్నాడు. పోలీసులు వచ్చేలోపు అప్ప తండ్రి చనిపోయాడు. కత్తి గుండెల్లో దిగి ఉంది. ఆ రాత్రి ఒంటి గంట సమయంలో అప్ప తిరిగిరాగానే పోలీసులు అరెస్టుచేశారు. ఈ హత్య తను చేయలేదంటాడు. మరి ఎక్కడికెళ్లావంటే టాంక్‌బండ్‌ దగ్గర కూర్చున్నాన్నంటాడు. కానీ పక్కనున్న గుడిసెలో ఆయన చెప్పిన సాక్ష్యాన్నే ఆధారంగా తీసుకున్నాం’’. విజయ్‌ చెప్పింది విని తలాడించాడు శరత్‌.