ఆమెను మోహించాడతను. ఎలాగైనా చేరువకావాలనుకున్నాడు. ఆమె ఇంటికెళ్ళిన ప్రతిసారీ ఆమెకేసి ఆబగా చూసేవాడు. అతడి భావాల్ని ఎప్పుడో పనిగట్టిందామె. లోలోపలే తెగ మురిసిపోయేది. సరైన సమయంకోసం ఎదురుచూసి, అనుకున్నట్టుగానే ఆమెను సొంతం చేసుకున్నాడు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందన్నట్టుగా అదే సమయంలో మరొకచోటకూడా అచ్చం ఇలాగే జరిగింది...! దాని పర్యవసానమేంటి?

రాత్రి పదిగంటల సమయం.ఆ వీధిలోని ఓ ఇంటి గుమ్మంలో...‍భర్త రాక కోసం ఎదురుచూస్తూ నిలబడి ఉంది సుధ.ఆమె కట్టుకున్న తెల్లచీరలోంచి ఆమె సౌందర్యం అస్పష్టంగా కనిపిస్తోంది.ఆమె తలలో ముడుచుకున్న మల్లెలు నవ్వులు రువ్వుతున్నాయి. పడకగదిలో ఆమె వెలిగించిన అగరొత్తులు మధుర సువాసనలు వెదజల్లుతున్నాయి.ఆ గదంతా అదోలాంటి మత్తుతో మునిగి ఉంది.సరిగ్గా ఆ సమయంలో సుధభర్త రఘురామ్‌ గేటుతీసి లోపలికి అడుగుపెట్టాడు.తనకోసం ఎదురుచూస్తున్న భార్యను చూడగానే అతని పెదవులపై నవ్వు మెరిసింది.‘‘ఇంత ఆలస్యం అయిందేమిటండి?’’ భర్త బ్యాగ్ అందుకుంటూ అడిగింది సుధ.‘‘ఆఫీసులో పని వత్తిడి’’‘‘ఈమధ్యన ఆలస్యంగా వస్తున్నారు. ఇంట్లో నేనొక్కదాన్నే ఉంటానన్న ధ్యాసేలేదు’’ చిరుకోపం ప్రదర్శించింది.‘‘ఏంచేయనూ, మా బాస్‌ కర్కోటకుడు.

పని పూర్తిచేస్తే కాని వదలడు’’ అంటూ భార్యను వాటేసుకున్నాడు. ‘‘ఏం చేస్తున్నారు?’’ అంది సుధ మురిపెంగా. రఘురామ్‌ ఆమె మెడమీద ముద్దుపెట్టుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు.ఆమె మత్తుగా కళ్ళు మూసుకుంది. ఒళ్ళంతా మైకం కమ్మినట్టయ్యింది. అంతలో ఏదో గుర్తుకొచ్చినట్టు ఉలికిపడి ‘‘ముందు భోజనం కానివ్వండి’’ అంది.‘‘అబ్బా, తరువాత చేయొచ్చులే’’ అంటూ మరింత పట్టు బిగించ బోయాడు.‘‘ముందు ఫ్రెష్‌ అయి రండి’’ అంటూ పట్టు విడిపించుకుని అతన్ని బాత్‌ రూమ్‌లోకి తోసింది. రఘురామ్‌ ప్రెష్‌ అయి లుంగీకట్టుకుని వచ్చాడు. కంచంలో వేడివేడి పదార్థాలు వడ్డించింది సుధ. రఘురామ్‌ ఆమెనే కోరికగాచూస్తూ భోజనం చేయసాగాడు. ఈరోజు ఆమె అలంకరణ అతణ్ణి కవ్విస్తోంది. కొంతకాలంగా తాను ఆమెను పట్టించుకోవటంలేదని గుర్తుకొచ్చింది. ఈవేళ మరుపురానిరోజు కావాలి అనుకున్నాడు.

తొందరగా రమ్మనిచెప్పి పడకగదివైపు అడుగువేసి హఠాత్తుగా పొట్ట పట్టుకుని కూలబడ్డాడు.సుధ కంగారుగా అతని దగ్గరికి వచ్చింది.‘‘పొట్టలో మంట’’ అన్నాడు బాధతో. సుధ అతడిని మంచందగ్గరకు తీసుకెళ్ళి పడుకోబెట్టింది. రఘురామ్‌ బాధతో మెలికలు తిరుగుతూ, పొట్ట పట్టుకుని ‘‘మంట... మంట..’’ అని గిలగిలా తన్నుకున్నాడు. కొద్దిసేపటికి అతని శరీరం కట్టెలా బిగుసుకు పోయింది. అప్పటివరకు మంచందగ్గరే నిలబడిన సుధ హాయిగా నిట్టూర్చింది. వెంటనే అతడి మెడవరకు దుప్పటికప్పి హాల్లోకి వచ్చింది. సోఫాలో కూర్చొని నిముష నిముషానికి గోడగడియారంవైపు, తలుపులవైపు ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్టు మార్చి మార్చి చూస్తోంది. అర్థరాత్రి గడిచినా ఆ వ్యక్తి రాకపోవటంతో ఆమెలో భయం మొదలైంది.