‘నిత్య జీవితంలో టెక్నాలజీ ప్రభావం అంతకంతకూ పెరిగిపోతున్న దృష్ట్యా, నేర నిర్ధారణలో ఎలక్ర్టానిక్ సాక్ష్యాలు కీలకపాత్ర వహిస్తాయి .... పోలీసుల్లో వ్యక్తిగత స్థాయిలోనూ, వ్యవస్థాగత స్థాయిలోనూ శాస్ర్తీయ దృష్టి పెరిగితేనే కేసులు బలంగా వుంటాయి...’ సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరిస్తోంది...ఇక్కడికి చాలా దూరంలో, వారణాసి జైల్లో, ఐదేళ్లుగా మగ్గుతున్న ఆ ఇద్దరు విదేశీ నిందితులు ప్రాణాలుగ్గ బట్టుకుని గడుపుతున్నారు అంతిమ తీర్పు ఎలా వస్తుందోనని ... కింది కోర్టుల్లో యావజ్జీవ శిక్షలు పడి, ఒక జైలు గదిలో అతను, ఇంకో జైలు గదిలో ఆమె ... ఎక్కడో తేడా కొట్టి ఇలా బందీలైన ప్రేమ పక్షులు...
******************
రెస్టారెంట్‌లో వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూంటే కళ్ళప్పగించి చూస్తున్నాడు వెయిటర్. వాళ్ళ మీంచి చూపులు అటుపక్క తిప్పాడు. అక్కడ కూర్చుని ఒకతను మండిపడుతున్నాడు. నిజానికి టొమసోని ముద్దాడుతున్న ఎలీసా, టొమసో గర్ల్ ఫ్రెండ్ కాదు. మండిపడుతున్న మాంటిస్ గర్ల్ ఫ్రెండ్. ‘ఫారినర్లు ఇంతేరా బాబూ’! అనుకున్నాడు వెయిటర్.ఇటాలియన్లు మాంటిస్, ఎలీసా, టొమసో ముగ్గురూ టూరిస్టులుగా వారణాసి వచ్చి హోటల్లో దిగారు. ఒకే రూంలో వుంటున్నారు. లండన్లోని ఒక హోటల్లో మాంటిస్ డ్రమ్మర్, ఎలీసా రిసెప్షనిస్టు అయితే, టొమసోవెయిటర్. ముగ్గురూ ఇండియా టూరు ప్లాన్ చేసుకుని కేరళ, గోవా చూసొచ్చి, ఇక్కడ దిగారు.
రాత్రి వెయిటర్ చూసిన ఆ ప్రణయ సన్నివేశం తర్వాత, ఉదయం ఎనిమిది గంటలకి కాల్ చేసి కంగారు పడ్డారు ఎలీసా, టొమసో. మేనేజర్ వెళ్లి చూస్తే, మాంటిస్ అపస్మారకంగా పడున్నాడు. వెంటనే హాస్పిటల్‌కి తరలిస్తూంటే దారిలోనే చనిపోయాడు. పోలీసులొచ్చి, ఏం జరిగిందన్నారు.‘గంగా తీరంలో సూర్యోదయాన్ని చూసేందుకు వెళ్లాం సర్, ఉదయం నాలుగ్గంటలకి.మాంటిస్ వొంట్లో బాగాలేదని రాలేదు. ఎనిమిది గంటలకి వచ్చి చూస్తే ఇలా జరిగింది సర్...’ అంటున్న ఎలీసా, టొమసోలని అపనమ్మకంగా చూశారు పోలీసులు.ఊపిరాడక చనిపోయినట్టు, మరణానికి ముందే గొంతు మీద ఆరు యాంటీ మార్టం గాయాలున్నట్టూ పీఎం రిపోర్టు వచ్చింది. మలి రిపోర్టు కూడా అలాగే వచ్చింది. వెంటనే ఎలీసా, టొమసోలని అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.