నిశ్శబ్దంగా, నిగూఢంగా కనిపిస్తోందా ఇల్లు. టాటా టియాగో వుంది బయట. కారు పట్టేంత ఇరుకు గల్లీలో జనసంచారం కూడా లేదు. ఇళ్ళన్నీ మధ్యాహ్నం మూడున్నర వేళ బద్ధకంగా, ఓ కునుకు తీస్తున్నట్టుగా వున్నాయి. బయట కళ లేదు, లోపల అలికిడుల్లేవు....
అంతలో ఆ ఇంట్లోంచి ఇద్దరు గబగబా వచ్చారు బయటికి. ఒక్క ఉదుటన కారెక్కి దూసుకుపోవడం మొదలెట్టారు వేగంగా. ఈ శబ్దానికి ఒకింటి తలుపు తెర్చుకుని, ఎవరా అని తొంగి చూశారు వాళ్ళు... కాస్సేపటికి తోంబాసింగ్ తిరిగొచ్చాడు. ఇంట్లోకి వెళ్ళాడు. వెళ్ళిన వాడు వెళ్ళినట్టే బయటికొచ్చి కేకలు వేయసాగాడు. అంతే, మధ్యాహ్నపు నిద్రమబ్బంతా వదిలిపోయి జనంతో నిండిపోయింది గల్లీ. ఇంటి ముందు తోంబాసింగ్ చెబుతున్నది నమ్మలేనట్టుగా విని, ఆ ఇంట్లోకి వెళ్ళారు. హాహాకారాలు చేశారు.యురిపక్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ లోకేంద్ర వచ్చి చూడసాగాడా దృశ్యాన్ని. ఇంఫాల్ అడిషనల్ ఎస్పీ ప్రియదర్శిని వచ్చేసింది. మొబైల్ ఫోరెన్సిక్ టీం కూడా చేరుకుంది. అలా అలా మణిపూర్ రాష్ట్రమంతటా ఆ తల్లీకూతుళ్ళ దారుణ హత్యావార్త పాకిపోయింది.
గర్భంతో వున్న మోనికా, ఆరోగ్యం సరిగ్గాలేని లఖీప్యారి... తలలు పగిలి, గొంతులు తెగి రక్తపు మడుగులో పడున్నారు. మోనికా గుప్పిట కొన్ని వెంట్రుకలు దొరికాయి ఫోరెన్సిక్ టీంకి.మోనికా తండ్రి తోంబాసింగ్ చెప్పసాగాడు ‘హిట్లర్ ఈ దుర్మార్గం చేశాడని’!‘‘హిట్లరెవరు?’’,‘‘హిట్లర్‌సింగ్ అనీ తమోచాసింగ్ కొడుకు. మా అమ్మాయిని ప్రేమించాడు. కాదని వేరే పెళ్లి చేశాం. కక్ష పెట్టుకుని ఇలా చేశాడు. చాలా సార్లు బెదిరించాడు కూడా వాడు!’’‘‘వాణ్ణి చూసుకోండి - ’’ అని ఇన్‌స్పెక్టర్‌తో చెప్పి, ‘‘వెపన్స్ దొరకలేదా?’’ అని సిబ్బందిని అడిగింది ప్రియదర్శిని.
ఫోరెన్సిక్ టీంకి మూడు సిమ్ కార్డులు దొరికాయి. ఇంటి వెనకాల్నుంచి సిబ్బంది రక్తమంటిన షావెల్ ఒకటి, కత్తి ఒకటీ పట్టుకొచ్చారు. బయట జనం లోంచి ఓ ఇద్దరు ముందు కొచ్చి, ఓ కారు స్పీడుగా వెళ్తుంటే చూశామన్నారు - టాటా టియాగో.ఫ ఫ ఫ‘‘కారు పోయింది !’’ అంటూ కంప్లెయింటివ్వసాగాడు హిట్లర్ సింగ్. అటు ఏఎస్పీ ప్రియదర్శినికి ఒక పిటీషన్ సమర్పించుకున్నాడు తండ్రి తమోచా.