‘మంచి ఉద్యోగం చేస్తున్నావు... నెలకు లక్షన్నర సంపాదిస్తున్నావు... ఇంక పెళ్లెప్పుడు చేసుకుంటావో ఏమో... నీకు సంబంధాలు వెతకలేక చస్తున్నా’ ఆఫీసుకు బయల్దేరుతున్నపుడు అమ్మ అన్న మాటలు రజిత చెవిలో మారుమోగుతున్నాయి.గత కొన్నాళ్లుగా రోజూ వింటున్న మాటలే ఇవి. తనకూ పెళ్లి చేసుకోవాలనే ఉంది. సాఫ్ట్‌వేర్‌ కొలువులో చేరిన మొదటి రెండేళ్లు సీటులో కుదురుకోవడానికే సరిపోయింది. ‘ఆ ప్రాజెక్ట్‌... ఈ ప్రాజెక్ట్‌’ అంటూ మరో నాలుగేళ్లు సంస్థలో పొజిషన్‌ కోసం పరుగుతోనే సరిపోయింది. ఆ రేసులో పరుగెత్తి... పరుగెత్తి... వెనక్కి తిరిగి చూసుకుంటే 32 ఏళ్ల వయసు కన్పిస్తోంది. వామ్మో... తెలియనే లేదు.ఈమధ్య తల్లి సతాయింపు ఎక్కువ కావడం తో ఇక తప్పదనుకుని మాట్రి మోనియల్‌ బయోడేటా తయారుచేసే పనిలో పడింది రజిత.తండ్రి చిన్నపుడే చనిపోవడంతో తల్లే అంతా తానై పెంచింది రజితను. పైగా ఆర్థికంగా ఏ లోటూ లేకపోవడం, ఒక్కతే కూతురు కావడంతో గారాబంగా పెరిగింది.

‘‘ఏమే రజితా... బయోడేటా అప్‌లోడ్‌ చేస్తానన్నావ్‌... చేశావా?’’‘‘ఈ రోజు చేసేస్తానమ్మా... నీకెందుకు బెంగ. రేపటిలోగా వంద మంది అబ్బాయిలు క్యూ కడతారు చూడు...’’ అంటూ హుషారుగా ఈల వేస్తూ చెప్పింది రజిత.నిజంగానే ఆ రోజు పేరున్న ఒక మాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో తన ప్రొఫైల్‌ను అప్‌లోడ్‌ చేసింది రజిత. తనకెలాంటి వరుడు కావాలనుకుంటోందో ఆ వివరాలను క్షుణ్ణంగా పేర్కొంది. ఆమె ప్రొఫైల్‌ చూసి చాలామందే రిక్వెస్టులు పంపించారు.లాప్‌టాప్‌ ముందు కూర్చుని మాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లోని తన పేజ్‌ను ఓపెన్‌ చేసింది ఒకరోజు.

కుప్పలు తెప్పలుగా ఉన్న రిక్వెస్టులను పరిశీలిస్తున్న రజిత చూపు ఒక ఫోటోపై పడింది. ఆకర్షణీయమైన రూపంలో ఉన్న ఆ యువకుడి వివరాలను పరిశీలించడం ప్రారంభించింది.తన పేరు విక్రాంత్‌ అని, బ్రిటన్‌లో పెరిగిన భారత సంతతికి చెందిన పౌరుడినని, ప్రస్తుతం ఇరాక్‌లోని ఐక్యరాజ్యసమితి విభాగంలో వైద్యుడిగా పనిచేస్తున్నానని అందులో రాశాడు.‘‘అమ్మా ఈ కుర్రాడు ఎలా ఉన్నాడే...’’ తల్లికి విక్రాంత ఫోటో చూపుతూ అడిగింది రజిత.‘‘కుర్రాడు బాగున్నాడు. మీ ఇద్దరి జోడీ కూడా బాగుంటుంది...’’