‘నా పనైపోయింది అంకుల్, ఇంటి కెళ్లనా?’ ట్రాలీ ఆటోని చెట్ల మధ్య ఆపుతూ అన్నాడు 24 ఏళ్ల నికుంజ్.‘ఉండరా, ఎవరు నాటాలీ ఇవన్నీ?’ నికుంజ్ వేసుకొచ్చిన పూలమొక్కల లోడ్‌ని చూపిస్తూ జయంతీ భాయ్ అన్నాడు.ముంబయి శివారు ఫాంహౌస్‌లో పూలమొక్కలు నాటే కాంట్రాక్టు చేపట్టిన జయంతి, మొక్కల్ని సాగుచేసే మేనల్లుడు నికుంజ్ నుంచి మొక్కల్ని కొంటున్నాడు.నికుంజ్ మొక్కల్ని అన్‌లోడ్ చేస్తూంటే, ‘సరేగానీ, రేపొక పనుంది, వస్తావా?’ అడిగాడు జయంతి. ఏంటన్నట్టు చూశాడు నికుంజ్. కన్ను గీటాడు జయంతి.
మర్నాడు మధ్యాహ్నం ముంబయిలోని కాండివిలీలో దేవేంద్ర దోషి ఫ్లాట్ కెళ్ళారు. రెండు గంటల తర్వాత చూస్తే 65 ఏళ్ల షేర్ బ్రోకర్ దేవేంద్ర దోషి చచ్చి పడున్నాడు. సీనియర్ ఇన్‌స్పెక్టర్ ముకుంద్ ఆ శవాన్నే పరిశీలనగా చూస్తూ నిలబడ్డాడు.‘‘బయట కెమెరాలున్నాయేమో చూడకూడదా?’’ అన్నాడు ఏసీపీ శ్రీరంగ్.సీసీ టీవీ ఫుటేజీలో వచ్చి పోతూ కన్పిస్తున్న ఇద్దర్నీ అపార్ట్‌మెంట్‌లో ఎవరూ గుర్తు పట్టలేక పోయారు. మర్నాడు పోలీస్‌స్టేషన్‌కు కేబుల్ ఆపరేటర్ వచ్చాడు. నిన్న పేమెంట్ కోసం దోషి ఫ్లాట్ కెళ్తే, ఎవరో ఇద్దరితో కలిసి భోంచేస్తూ కన్పించాడనీ, తనని రేపు రమ్మన్నాడనీ సమాచారమిచ్చాడు.
ఇన్‌స్పెక్టర్ ముకుంద్ సీసీ టీవీ ఫుటేజీ చూపించాడు. కేబుల్ ఆపరేటర్ ఆ ఇద్దర్నీ గుర్తుపట్టి, ‘‘వీళ్ళే భోంచేసింది...’’ అని ధృవీకరించాడు.ఏసీపీ శ్రీరంగ్‌తో చర్చించాడు ఇన్‌స్పెక్టర్ ముకుంద్, ‘‘సర్, ఆయనకి మూడు ఫోన్లు ఉండాలట, మూడూ లేవు. కత్తి పడుంది, కానీ కత్తి ఒక్క దాంతోనే చంపలేదు, ఇంకో వెపనేదో ఉండాలి. కబోర్డులో క్యాష్, గోల్డ్‌కాయిన్స్ అలాగే ఉన్నాయి సర్’’‘‘వాళ్ళు పెద్ద బ్యాగు మోసుకుపోతున్నట్టు కన్పిస్తున్నారు చూశారా, అందులో ఇంకే మున్నట్టు? సరే, కాల్ లిస్టు తీయించండి, అప్పుడెవరొచ్చారో తెలుస్తుంది’’ అన్నాడు శ్రీరంగ్. ‘‘అయితే ఈ మెయిల్స్ పెట్టండి సర్’’ రిక్వెస్ట్ చేశాడు ముకుంద్.రెండు రోజులయ్యాక కాల్‌లిస్టు చూస్తూ కూర్చున్నాడు ముకుంద్. దోషికి ఆ రోజు చివరిగా వచ్చిన కాల్‌నంబర్‌ని గుర్తించి, శ్రీరంగ్ చేత మళ్ళీ ఈ మెయిల్ పెట్టించాడు. సర్వీస్ ప్రొవైడర్ నుంచి ఆ నంబర్ వివరాలొచ్చాయి.