స్పేస్‌ ఒపేరా అంటే వైజ్ఞానిక కాల్పనిక సాహిత్యంలోని ఒక ఉపవిభాగం. భవిష్యత్తులో రాబోయే వైజ్ఞానిక ప్రగతీ, వివిధ గ్రహాల మధ్య, కొన్ని సామ్రాజ్యాల నడుమ ఆధిపత్యాలకోసం చేసే యుద్ధాలూ, కొంత రొమాన్స్‌, కొన్ని అతీంద్రియ శక్తుల తాంత్రిక వ్యూహాలూ, ప్రయోగాలూ ఈ స్పేస్‌ ఒపేరా లక్షణాలుగా చిత్తర్వు మధు ఇదివరకు ఆంగ్లంలో ఒక నవలాత్రయంగా రాశారు. అవి: ‘కుజుడి కోసం’ (నాలుగో సహస్రాబ్ది కథ), రెండు: ‘నీలి ఆకుపచ్చ’ (భూమికి తిరిగి రాక) మూడవది: ‘అంతిమ ప్రతీకారం’ (భూమి నుంచి ప్లూటో దాకా..). ఒక పక్క సైన్స్‌ వర్థిల్లినా మరొక వైపు అతీంద్రియ శక్తులు, మంత్రాలు, శాపాలు, వున్న ‘యూనివర్సల్‌ ఫోర్స్‌’ ఒకటి కూడా భవిష్యత్తులో వుంటుందని ఊహించి రాసిన నవల ఇది. ఉదాహరణకు.. హనీ ఆమ్రపాలి.. భూమిమీది ఇండికా సెంట్రల్లో ఒక ప్రొఫెసర్‌, ప్రకృతి ఆమ్రపాలి హనీ భార్య. ఈమెకు మంత్రశక్తులున్నాయి.. నారా ఆమ్రపాలి, నయన ఆమ్రపాలి వాళ్ళ తల్లిదండ్రులు, కుజగ్రహంలోని పాత్రలు.. గ్యానీ అంగారక్‌, సైన్యాధిపతి, కాన్‌స్టంటన్‌, కుజగ్రహ కాలనీ అధ్యక్షుడు, ఛెన్‌ లీ, ఎర్త్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు, డిమిట్రీ ఒక మంత్రగత్తె, ఏనిమాయిడ్‌ ఒక జంతువులాంటి మాంత్రికుడు.. ఇలా కల్పిత పాత్రల గ్రహాంతర కాలనీలకు సైన్స్‌ ఆధారాలున్నాయి. కాని మాంత్రికులు, మంత్రశక్తులు, కాలప్రయాణాలు, వార్మ్‌ హోల్స్‌ వీటికి ఆధారాలు లేవు. నవలంతా ఒక మాయాలోక గమనంవలె భ్రాంతిని ప్రత్యక్షిస్తుంది. బాలలూ, యువతరం పిచ్చిగా ఒళ్ళుమరచి రాత్రింబవళ్ళు ‘గేమింగ్‌’లో ఆడుతూ ఆనందపడ్తున్నవిజ్ఞాన, వినోద, వైకల్పిక భ్రాంతిలో జీవించే లక్షణాలను ఇష్టపడే పాఠకులు ఈ పుస్తకాన్ని చాలా ఆదరిస్తారు.

- రామా చంద్రమౌళి

భూమి నుండి ప్లూటో దాకా ...

(స్పేస్‌ ఒపెరా నవల )

రచన: చిత్తర్వు మధు, అనువాదం: కొల్లూరి సోమశంకర్‌

పేజీలు: 296, వెల: రూ. 175

ప్రతులకు: సాహితి ప్రచురణలు, 81210 98500