పసితనంలో రోడ్డు మీద ఎవరైనా నవ్వుకుంటూ ఉంటే, నన్ను చూసే నవ్వుతున్నారేమో అనుకునే అజ్ఞానం ఉండేది. నన్ను చూసి నవ్వడానికి, నా ఏడుపులో భాగం పంచుకోడానికి ప్రపంచంలో ఎవ్వరికీ ఖాళీ ఉండదనే జ్ఞానం ఏర్పడ్డానికి, బతుకు బడిలో చాలా పాఠాలే చదవాల్సి వచ్చింది. అంటే నిన్నటి భావన నిన్నటికి నిజం. అది అబద్ధం అని ఇవాళ్టికి తెలిసొస్తే .. మనం కాస్త అప్‌డేట్‌ అయినట్లు లెక్క! ఒక వయసులో కోప హేతువు... కాస్త వయసు ముదిరాక అవివేకంగా అనిపిస్తుంది. అదే మనలోని మనం అప్‌ డేట్‌ కావడం! సాఫ్ట్‌వేర్‌ పరిభాషలో వెర్షన్‌ 2.0. బతుకులో తుదిశ్వాస వరకూ ఇలా ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్లు వస్తూ ఉంటేనే మంచిది.సింపుల్‌గా చెప్పాలంటే, జ్ఞానం అనే పదం నాకు చాలా చిరాకు. అంత చంచలమైనది మరొకటి ఉండదు.

 నిన్నటి జ్ఞానం ఇవాళ్టికి అజ్ఞానం! అలా అనిపించడమే కొత్త జ్ఞానం పుట్టుకకు సంకేతం. ఆ రకంగా ఎంచినప్పుడు.. మనకు తెలిసినది ఎంతైనా సరే, అది అజ్ఞానం లేదా అర్ధజ్ఞానం అని ఆకళింపు అవుతున్నకొద్దీ.. ఆ తర్వాత ఏదో తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరుగుతున్న కొద్దీ ... మనలోని జ్ఞానం విస్తృతమవుతున్నట్లుగా ఒక తృప్తి. ఏది జ్ఞానం.. ఏది అజ్ఞానం? ఈ ద్వైదీ చింతనలో కొట్టుకులాడుతూ ఉండిపోవడమేనా జీవితం అంటే?వెధవది క్షుద్రప్రాణి పాము- విసుగెత్తితే దేహపుపొరను వదిలేసి కొత్తతోలుతో తిరుగుతుంది. మాసినవని మనం, బట్టలు విడచి, ఉతికించి మళ్లీ కొత్తగా తొడుక్కుంటాం. కొమ్ములొచ్చాయా ఏమిటి? జ్ఞానమైనా అంతే. అది మాసిపోతే త్యజించి, కొత్త జ్ఞానాన్ని ఎక్కించుకోవాలి! లేదా, ఉతికించి కొత్తగా అవధరిస్తూ ఉండాలి. మన బుర్రకు ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అయిన జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్‌ డేట్‌ చేసుకుంటూ పోవాలి.

లేకుంటే వెనకబడిపోతాం.అసలు జ్ఞానం అంటే ఏమిటి? ‘మనకు ఏం తెలియదో, ఆ సంగతి అవగాహన చేసుకోవడమే జ్ఞానం’ అని ఏదో చీనా సామెతను ఉదాహరించి చెబుతుంటాడొక మిత్రుడు. మనకు తెలుసనుకునే విషయాలను ప్రపంచానికి పంచిపెట్టడానికే మన వదరుబోతు బతుకుల్లో ఖాళీ లేకపోతుండగా, ఇక ‘లోపలికి’ తొంగిచూసుకుని మనకు ఏం తెలియదో గ్రహించగల ఓర్పు, తీరిక ఎవరికుంటుంది? ఈ జ్ఞానాజ్ఞానాల గురించిన చింత ఎప్పుడూ చిక్కుముడే! ఇవాళ ఉదయం అవధాన్ల పరమేశ్వరుడు నుంచి ఫోను రాకపోయి ఉంటే గనుక... నేను ఎన్నటికీ ఈ చింతనల చిక్కుముడిలోకి చొరబడేవాడినే కాను.