ఈ మధ్య చిదంబరం ఆరోగ్యం బాగుండటం లేదని తెలిసి చూడటానికి బయల్దేరాను. హైద్రాబాద్‌ ఎర్రమంజిల్‌ నుంచి మియాపూర్‌.. బస్‌ ప్రయాణం. ఎండ కరకరలాడుతోంది.బస్‌ వెళుతోంది. నా ఆలోచనలు చిదంబరం చుట్టూ తిరగసాగినై.చిదంబరమూ నేనూ బాల్యమిత్రులం. ఇద్దరమూ బందరు వాళ్లం. గొడుగుపేటలో మా ఇంటికి రెండిళ్ల అవతల వాళ్ల ఇల్లు. ఒకే స్కూల్లో మా చదువు. ఒకే క్లాసువాళ్లం. చిదంబరం నాన్న శంకరయ్య. 

చిలకపూడిలో గోల్డ్‌ కవరింగ్‌ వర్క్స్‌లో నగల తయారీపని. చాలీచాలని సంపాదన. అమ్మ సుభద్రమ్మ - హోల్‌సేల్‌ షాపుల్లో బియ్యమూ, పప్పులూ బాగుచేసి నాలుగురాళ్లు తెచ్చుకొనేది. సాయంత్రం పూట ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలకి సంగీతం నేర్పుతూ ఉండేది.చిదంబరం అవస్థ చూసి ‘‘పోనీ మా ఇంటికి రా, కలిసి చదువుకుందాం’’ అంటే వచ్చేవాడు కాదు. మా నాయనమ్మంటే భయం. ఆమెది కొంచెం పెద్దనోరు! మా నాన్నది చిన్న స్టేషనరీ షాపు. పత్రికలూ అమ్మకానికుండేవి. మా నాయనమ్మ పేరున ఓ రెండెకరాల పొలం ఉంది. దానిమీద ఫలసాయం మాకు పెద్ద ఆదరువు! అందుకేనేమో నాకు చిదంబరం వాళ్లకంటే మేము కొంచెం పైమెట్టువాళ్లమనే భావన ఉండేదనుకుంటాను.చిన్నప్పుడు చిదంబరానికి ఒక్కటే కోరిక. రాత్రిపూట చదువుకోవడానికి అనువుగా ఒక లాంతరు కావాలి.వాళ్లది రైలుపెట్టెలాంటి మూడు గదుల రేకులషెడ్డు. అద్దె ఇల్లు. మొదటిగదికీ మధ్యగదికీ మధ్య తలుపు లేదు. ఆ మండిగం మీద ఉండే దీపపు బుడ్డి మాత్రమే ఆ రెండు గదులకి వెలుగు. అక్కడే చిదంబరం చదువు.

తమ్ముళ్లిద్దరూ కూడా వీడి పక్కకి చేరేవారు. చివరి చెల్లెలు రెండేళ్ల బుజ్జి ఈ గదిలోకి ఆ గదిలోకి తిరుగుతూ చదువు సాగనిచ్చేది కాదు. రెండో బుడ్డీ వంటింట్లో ఉండేది. అప్పటికీ, అక్కడికి పోయి కూచుని ఏ నోట్సో రాసుకోవాలని ప్రయత్నించేవాడు. ఇంతలో వాళ్లమ్మ దాన్ని తీసుకుపోయి - స్నానానికో, రోట్లో పచ్చడి నూరటానికనో పెరటిగుమ్మం మండిగం మీద పెట్టుకునేది.ఇదీ చిదంబరం అవస్థ. అతని చిన్నమనసులో పెద్ద లాంతరు కోరిక. నాన్ననడిగితే ‘కొందాములేరా’, ‘డబ్బు కావాలిగా’ అని ఊరుకునేవాడు. ‘డబ్బు’ మాట చిదంబరం బుర్రకెక్కింది. అమ్మని సతాయిస్తే ‘చాల్లే సంబడం...’ అని ఏదో సామెత చెబుతూ ఉండేది. ‘డబ్బేమన్నా చెట్టుకి కాస్తోందిట్రా?’ అని కసురుకొనేది.