ఆడదంటే మగవాడికి రెండు రకాలుగా మాత్రమే కనిపిస్తుంది. ఒకటి పగలు కాయకష్టంచేసి డబ్బులివ్వడానికి, రెండు రాత్రి సుఖాలివ్వడానికి. ఈ దేశపు దౌర్భాగ్యం ఏమిటోగానీ చచ్చో పుచ్చో ఎవడో ఒక మగవాడి అండలేకపోతే, జీవితం గడవదనే అనుకుంటారు ఎక్కువమంది ఆడవాళ్ళు. ఆ క్రమంలో, ఆ ప్రేమతత్వంలో తమ వ్యక్తిత్వాన్ని, స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛని కూడా వదిలేసుకుని బానిసైపోతారు. ఈ కథలో జరిగిందీ అదే! కానీ....

***********************

దుబాయ్‌ నాగమణి చచ్చిపోయిందనగానే అందరూ నోరెళ్ళబెట్టారు.నాగమణి చావు కబురు తెలిసిన తర్వాతనే చాలామందికి నాగమణి గుర్తొచ్చింది. అంతవరకూ బతికుందో లేదో పట్టించుకున్నవాళ్ళే లేరు.దాదాపు పాతికేళ్ళకిందటిమాట, గోదావరిజిల్లాల్లో చాలామంది చెట్టు కాలిపోతుంటే ఎగిరిపోయిన పిట్టల్లా దుబాయ్‌ విమానాలు ఎక్కేశారు.ఊరుదాటివెళ్ళని నాగమణి దుబాయ్‌వెళ్ళినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. నాగమణి దురదృష్టాన్ని తలుచుకుని జాలిపడ్డారు. ఆ తల్లి దరిద్రాన్ని, కష్టాలను దారిలేనితనాన్ని కథలు కథలుగా చెప్పుకున్నారు.నాగమణి పెద్దగా చదువుకోలేదు. మంచి వరి పంట పండే ఎకరం పొలం, పది కాసుల బంగారం, ఓ మోటార్‌బైక్‌ ఇచ్చి అన్నింటికీ మించి నాగమణి నూరేళ్ళ జీవితం కలిపి, సత్తెయ్య చేతిలో పెట్టాడు నాగమణి తండ్రి.నాగమణి మొగుడు ఊళ్ళో ట్రాక్టర్ల రిపేరు షాప్‌ పెట్టాడు.అయితే షాపులోనే సాయంత్రం మందు పార్టీలు పెట్టేవాడు. హేంగోవర్‌ దిగకో, ఎక్కకో పొద్దునేళ షాప్‌లోనే పేకాటపెట్టాడు.

పెద్దోళ్ళు అందరూ (వయసులో కాడు – డబ్బులు సంపాదించే దారిలో ఉన్నవాళ్ళు) చీట్లపేక చుక్కలతోనే ఫ్రెండుషిప్పులు పెంచుకుని, రకరకాల లావాదేవీలతో లక్షలు గడిస్తుంటారు. అదేంటో లక్ష్మీదేవికి అక్కడరాని మొహమాటంకోసం సత్తెయ్యలాంటి మధ్యతరగతి వాళ్ళు పనిచోటులో పేకాట ఆడితే వస్తుంది.లక్ష్మీదేవికి కోపమొచ్చింది.ఆ ఊళ్ళో ట్రాక్టర్లు రిపేర్‌ చేయడానికి మరోషాప్‌ వచ్చింది కానీ, సత్తెయ్యని వాడి బతుకుని రిపేర్‌ చేయడానికి ఎవరూ రాలేకపోయారు.పెళ్ళాం మెడలో బంగారు నగలు కానీ, పొలం కానీ మొదట తాకట్టేపెట్టాడు. ఆ తర్వాత వాటికి వడ్డీలు కట్టలేక, అమ్మేయాల్సివచ్చింది. అప్పుడు మొదటే అమ్మేయాల్సిందికదా అని నాలిక కరుచుకున్నాడు.ఈ దిగజారుడు, తెగనమ్ముడు కూడా త్వరగా జరగలేదు.నాగమణికి ముగ్గురు పిల్లలు పుట్టేంతవరకూ జరిగింది. ఓ కూతురు, ఇద్దరు కొడుకులు.