సమయం రాత్రి పదకొండు గంటలు దాటింది. ఆ హాల్ ట్యూబులైట్ కాంతితో నిండిపోయి ఉంది. ప్రక్కప్రక్కగా బెడ్స్ వేసి ఉన్నాయి. బెడ్‌కీ బెడ్‌కీ మధ్య మందపాటి కర్టెన్ మాత్రమే అడ్డం. దాదాపు పదిహేను బెడ్స్ ఉన్న ఐ.సి.యులో చుట్టూతా హార్ట్‌బీట్ మానిటర్స్ చేసి బీపింగ్‌సౌండ్ నాకు భరించలేనట్లుగా ఉంది. ఆ శబ్దం వినీ వినీ ఏదో ఫాటిగ్. అమ్మకు హఠాత్తుగా హార్ట్ ఎటాక్ వచ్చింది. మా ఫోన్ అందుకుని క్షణాల్లో వచ్చిన మా ఫ్యామిలీ డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ తరువాత ‘గవర్నమెంట్ హాస్పిటల్‌లో చాలా అనుభవజ్ఞులైన డాక్టర్స్, అత్యాధునికమైన పరికరాలు ఉన్నాయి. నేను అక్కడ కార్డియాలజిస్ట్‌గా పని చేస్తున్న నా స్నేహితుడికి రిఫరెన్స్ ఇస్తాను. అనుమానపడకుండా వెంటనే చేర్చు’’ అని నమ్మకంగా చెప్పటంతో ఇక్కడ చేర్పించాను.
అమ్మకోలుకోవటంతో నాకు కాస్త ఆందోళన తగ్గింది. అమ్మకి అమర్చిన మానిటర్ కేసి చూసాను. దానిలో గీతలు క్షణం విశ్రాంతి లేకుండా పరిగెడుతున్నాయి. అవి విశ్రాంతి తీసుకుంటే అమ్మ శాశ్వత విశ్రాంతి తీసుకోవాల్సిందే. అమ్మో, ఆ ఆలోచన భయమేస్తోంది. ఎంత వయసు వచ్చినా ఆ తల్లిదండ్రులకు దూరమవ్వటం యెంత బాధాకరం. సంవత్సరం క్రితం నాన్న చనిపోయినప్పుడు యెంత బాధపడ్డానో! జన్మనిచ్చిన వారిని కోల్పోవటం యెంత కష్టం... ‘మరి పునర్జన్మనిచ్చిన వారిని’ అని మనసు ప్రశ్నిస్తున్నట్టు ఉంది.తెర అవతల బెడ్ మీద స్త్రీ మూలిగింది. నిద్రపోతున్న అమ్మ మొహంలో భయం. అమ్మమీద చెయ్యి వేసి నిమిరాను. అమ్మ నా చేతిని గట్టిగా పట్టుకుంది.
పట్టుకున్న అమ్మ ఆ బలహీనమైన చెయ్యి నాకు ఏదో బలాన్ని ఇస్తున్నట్టుగా ఉంది. రెండు రోజుల క్రితం మా ప్రక్క తెర అవతల బెడ్ మీద కుర్రాడు చనిపోయాడు. ఆ తల్లి రోదన విని అమ్మ తల్లడిల్లిపోయింది. జీవనానికి, మరణానికి మధ్య ఓ తెర కదూ అడ్డు... మరణం అంత దగ్గరగా ఉన్నా ఓ తెరే కదూ అది సమీపించే దాకా తెలీకుండా చేస్తోంది..’ అంటూ ఏవేవో పదేపదే కలవరించింది. ఓ గంటలోపే ఆ కుర్రాడిని వాళ్ళ వాళ్ళకి అప్పగించి మరో పేషెంట్‌ని ఆ బెడ్ మీద చేర్చారు.