ఉదయాన్నే, ఆదరాబాదరగా స్నానం ముగించుకున్నాడు శంకరం.‘‘మాఆఫీసరు ముండావాడితో, క్యాంపుకెళ్ళాలి’’ అంటూ హడావిడిగా బయలుదేరి ఆఫీసుకెళ్ళిపోయాడు. భార్య తాయారు కాఫీ ఇస్తానన్నా ఆగకుండ వెళ్ళిపోయాడు శంకరం. అతడువెళ్ళి పావుగంట గడిచిందో లేదో, అంతలోనే వీధి తలుపుని దబాదబా బాదేస్తున్నారెవరో.

‘‘ఎవరది..’’ పెద్దగొంతుతో అంది తాయారు.‘‘నేనే నే’’ చప్పున తలుపు తియ్‌ అన్నాడు శంకరం.తాయారు, తలుపుతీసి, ‘‘అదేంటి? ఆఫీసరుముండావాడితో ఏదో క్యాంపుకు తగలడాలని తిట్టుకుంటూ వెళితిరే! అప్పుడే తిరిగి వచ్చారేం’’ అంది.‘ఊరికే ఒట్టి చేతులూపుకుంటూ తిరిగి వచ్చావనుకుంటున్నావా, మన అదృష్టంపండి సాక్షాత్తు కనకమహాలక్ష్మిని వెంటపెట్టుకొచ్చాను’’ అన్నాడు గాలిలో తేలిపోతున్నట్లు.‘‘కనకమహాలక్ష్మా..! అదెవరూ? ఆమధ్య మీ ఆఫీసులో ఓ కులుకులాడి టైపిస్టుగా చేరిందన్నారు దాన్నా?’’‘‘ఛ! ఛ! అదే బ్రమొహమా...అదెందుకు... నేను వెంటపెట్టుకొచ్చింది మనపాలిట భాగ్యలక్ష్మిని. ఇటుకేసి చూడు, నా వెనకాల ఎవరున్నారో అంటూ తన వెనక ఉన్న స్వరూపానికి అడ్డు తొలిగాడు శంకరం.

అక్కడ మాసిపోయిన చింపిరిగుడ్డలతో, సుమారు ఐదేళ్ళపిల్లవాడు పిచ్చిచూపులు చూస్తూ కనిపించాడు. తాయారు వాణ్ణి ఎగాదిగా చూసి, ‘‘ఎవడీ, చీమిడిముక్కు చింపిరి వెధవ! వీణ్ణా మీరు కనకమహాలక్ష్మి, భాగ్యలక్ష్మి అంటున్నారు’’ అంది.‘‘ఏవిటి, ఈయనగారు నీకు అలా కనిపిస్తున్నారా? ఒక్కసారి సరిగ్గా కళ్ళు తెరచి, తేరిపారచూడు.. రెపరెపలాడుతున్న ఆ కనురెప్పలు, ఆ నొక్కుల జుట్టు, కోటేరేసిన ఆ మక్కుతో వెలిగిపోతున్న బాల యువరాజావారిలా కనిపించటం లేదూ!’’ అన్నాడు శంకరం తన వర్ణనకు తానే మురిసిపోతూ.‘‘ఏవిటి? సగం మూసుకుపోయిన ఆ కళ్ళు, అట్టలుగట్టిన జుట్టు, ఆ చప్పిడిముక్కుతో ఈ మసిబొగ్గురాయుడు మీకు యువరాజాలా కనిపిస్తున్నాడా..? కొంపతీసి మిమ్మల్ని ఏ పిచ్చికుక్కో కరవలేదు కదా’’ అంది మంగతాయారు ఉరఫ్‌ తాయారు.