హైదరాబాద్‌నుంచి విజయవాడ చేరుకున్నాడతను. అక్కడి నుంచి గుంటూరు బస్సెక్కి చిన్న గ్రామం వెళ్ళాలి. ఎవరో ఒక స్ర్తీ నాలుగులైన్ల ఉత్తరం రాసింది అతడికి. అవసాన దశలో ఉన్నాను, చూడాలని ఉంది రా అని. తన బంధువుల్లోగానీ, ఫ్రెండ్స్ సర్కిల్‌లోగానీ ఆ పేరుగలవాళ్ళెవరూ లేరు. కానీ పెర్ఫెక్ట్‌గా తన అడ్రస్‌కే వచ్చిందాఉత్తరం. ఆమె ఎవరో తెలిసినా, తెలియకపోయినా సాయంచేసే ఉద్దేశంతో బయలుదేరాడతను. ఇంతకూ ఆమె ఎవరు? అక్కడేం జరిగింది?
వినయ్ విజయవాడలో హైదరాబాదునుంచి వచ్చిన గరుడ బస్సు దిగేటప్పటికి ఇంకా తెల్లవారలేదు. డిశెంబరు చలి కృష్ణ మీదుగా వస్తూ ఒణికిస్తోంది. బస్టాండంతా దీపాలతో వెలిగిపోతుంది.గుంటూరువైపు వెళ్ళే బస్సులు ఆగే ఫ్లాట్‌ఫాంవైపు నడిచాడతను. అంతకు ముందు వేరు వేరు సందర్భాలలో విజయవాడ వచ్చినా అతడికి ఆ ఊరు అంతగా తెలియదు. ఇప్పుడు రాష్ట్రరాజధాని అయిన తర్వాత ఊరు రూపురేఖలే మారిపోయి ఉండవచ్చు.తను సాయిరాంపురం వెళ్లాలి. అది మంగళగిరికి మూడు కిలోమీటర్ల దూరంలో హైవే పక్కనే ఉన్నదట. ఎర్రబస్సెక్కితేనేగానీ ఆ ఊళ్లో దిగలేడట. అంతకుముందు అతడెప్పుడూ అక్కడకు వెళ్లలేదు.ఇప్పుడైనా ఆ ఊరు వెళ్లాలనుకోవడానికి కారణం ఓ ఆగంతకురాలి నుండి క్రితం రోజు వచ్చిన ఉత్తరం. ఎంతగా ఆలోచించినా ఆమె ఎవరో అతడికి గుర్తురావడం లేదు.
బంధువో, స్నేహితుడి తాలూకు మనిషో అర్థం కావడం లేదు. ఆమె తనకే ఆ ఉత్తరం రాసిందీ అంటే ఆమెకు తను తప్పకుండా తెలిసి ఉండాలి. లేకపోతే అంతసరిగ్గా తన చిరునామా రాసి ఉండేదే కాదు. నాలుగురోజుల క్రితం రాసినట్లున్న ఆ ఇన్‌లాండ్ లెటర్‌లో రెండు మూడు వాక్యాలే ఉన్నాయ్, అవీ వంకరటింకర అక్షరాలతో.‘‘నిన్ను ఎంతగానో చూడాలనుకుంటున్న నేను అవసానదశలో ఉన్నాను. రోజులు లెక్కిస్తున్న నాకు ఒక్కసారి వచ్చి కనపబడితే ఎంతగానో సంతోషిస్తాను–జయమ్మ!’’ ఎక్కడి నుంచి రాసిందో తెలియాలన్నట్లుగా ఆమె చిరునామా స్పష్టంగా ఉంది.
తనకు తెలిసినవాళ్లెవరూ సాయీరాంపురంలో లేరు. పక్కన మంగళగిరిలో లేరు. అంతదాకా ఎందుకు ఆ జిల్లాలోనే లేరు. తను కాకినాడలో చదువునేటప్పుడు చాలామంది స్నేహితులుండేవారు. వాళ్లి్ళ్లకు వెళుతుండేవాడు. అలాంటి ఏ స్నేహితుడి తల్లో కాదుగదా ఆమె. వాడు ఆమెను అనాథగా వదిలేస్తే తన చిరునామా పట్టుకుని ఈ ఉత్తరంగానీ రాసిందా? ఎవరిని అనుకోగలడు అప్పటి సన్నిహిత మిత్రులు రామం, చంద్రం, సుభాష్‌లాంటి నలుగురయిదుగురు ఇప్పుడెక్కడున్నారో కూడా తెలియదు.