వరుస సెలవులు రావడంతో బాగా ప్లాన్‌చేసి పిల్లలిద్దరికీ విశాఖపట్నం చూపించాలని నిర్ణయించారు ఆ తల్లిదండ్రులు. బీచ్ ఎదురుగా హోటల్లో బసచేశారు. ఉదయమే బీచ్కివెళ్ళి సూర్యోదయాన్నీ, బీచ్ ఒడ్డునీ చూసి ఆ పిల్లలు వావ్..అంటూ మురిసిపోయారు. ఆ వాతావరణాన్ని బాగా ఎంజాయ్ చేశారు. కానీ ఆ తర్వాత బీచ్‌లో ఆ పిల్లలిద్దరూ చేసినపనిచూసి పెద్దలూ పిన్నలందరూ దిగ్ర్భాంతి చెందారు. ఇంతకూ వాళ్ళేం చేశారు?
ఉదయాన్నే కారులో విశాఖపట్నం బయలుదేరింది దీప్తి కుటుంబం. రాత్రినుంచీ సన్నని జల్లు పడుతోంది. ‘‘దేశంలో ఎక్కడ తుఫాన్ వచ్చినా హైదరాబాద్ లో వానలు పడుతూనే ఉంటాయి’’ అంది దీప్తి.నాలుగురోజులు వరసగా సెలవులు రావడంతో ఆరేళ్ళ కవలపిల్లలు విహాన్, అమన్‌లను తీసుకుని హాలిడే ట్రిప్‌కి వెళ్ళాలనుకున్నారు విష్ణు, దీప్తి. నాలుగురోజుల్లో ఎక్కడికి వెళ్ళాలి? అని నెట్ లో ట్రావెల్ సైట్స్ చూసింది దీప్తి. నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో తమ పిల్లలిద్దరూ చిన్నప్పటినుంచీ చూస్తున్న కొండలు, నదులు ఎలా ఉంటాయో తీసుకెళ్ళి పిల్లలిద్దరినీ చూపించారు. కొండలు, గోదావరి, అడవి, సముద్రం, జలపాతాలు, ఎడారి ఇలా ఇంకా ప్రకృతికి సంబంధించినవెన్నో పిల్లలకు చూపించాల్సి ఉంది. ఈ సెలవల్లో పిల్లలకి సముద్రం చూపించడానికి వైజాగ్ వెళ్లాలనుకున్నారు. వానలున్నాయని వెదర్ యాప్ చూపిస్తోంది.
ఐతే వానలవల్ల ప్రయాణం మానుకోవాల్సిన అవసరంలేదు, వైజాగ్‌లో వాన ఉన్నా కారులో ఊరంతా తిరిగి చూడొచ్చు అనుకున్నారు.కారు, విమానం, బస్సుల్లో ప్రయాణం పిల్లలకి తెలుసు. విమానంలో వెళితే టైం కలిసి వస్తుందని విమానం వేళలు, ధరలెలా ఉన్నాయో ట్రావెల్ సైట్ లో చూసింది దీప్తి. కానీ టికెట్స్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ‘ప్చ్! ముందుగా ప్లాన్చేసుకుని ఉంటే టిక్కెట్లు బుక్ చేసుకునే వాళ్ళం కదా’ అనుకుని విమాన ప్రయాణం విరమించుకున్నారు విష్ణు దీప్తి. ‘పిల్లలిద్దరికీ ఇప్పటి వరకు రైలు ప్రయాణం ఎలా ఉంటుందో తెలీదు. ట్రైన్ లో వెళితే ఎలా ఉంటుంది? అని మళ్ళీ ఆలోచించారు. కానీ అప్పటికప్పుడు రిజర్వేషన్ దొరుకుతుందో లేదో అదీ కాక విశాఖపట్నంలో తిరగడానికి చేతిలో కారు ఉంటే ఎక్కువ సౌకర్యంగా ఉంటుంది కదా! కారులోనే వెళదాం’ అని ఫైనల్‌గా డిసైడై బయలుదేరారన్నమాట.