పెళ్లయిన ముప్ఫై ఏళ్ల తర్వాత .. భర్త ఇంట్లో లేని సమయంలో.. ఓ లేఖను రాసి పెట్టి.. తన బట్టలు తీసుకుని ఆ ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టిందా ఇల్లాలు. ఆ లేఖను చూసిన భర్తకు కోపం తన్నుకువచ్చింది. భార్య చేసిన పని ఇదీ.. అంటూ బంధువులకు లేఖలు రాశాడు. ఆ తర్వాత బంధువులు కూడా ఆమె వద్దకు వెళ్లి.. ఆరా తీశారు.. ఇంతకీ అసలేం జరిగిందంటే...

***********

పెద్దగా చదువుకోని కమలకు చిన్న ఉద్యోగం దొరికింది. ఉద్యోగం సమస్య తీరిన కొద్ది రోజులకే ఆమె ఉండటానికి ఇల్లు వెతుక్కోడానికి నిర్ణయించుకుంది. ఉద్యోగాలకి దరఖాస్తులు పెడ్తుంటే ‘‘నీకీ వయస్సులో ఉద్యోగం ఎందుకట?’’ అని అడిగాడు భర్త రామారావు. ‘‘సుఖంగా ఉండాల్సిన వయస్సులో ఎందుకమ్మా ఈ అర్థంలేని పనులు’’ అని నొచ్చుకుంటూఅడిగాడు కొడుకు నారాయణ.

‘‘అక్కయ్యా! ఉద్యోగం చేయాల్సిన ఖర్మ నీకెందుకు! వచ్చి నాతో ఉండు, నీకేదైనా మనస్సు నొప్పి కలిగితే!’’ ఉత్తరం రాశాడు తమ్ముడు కృష్ణ.అప్పుడు కమల అందరికి ఒకటే సమాధానం చెప్పింది. ‘‘నాకు తోచడం లేదు. ఎప్పుడు విసుగు వస్తే అప్పుడు మానేస్తాను.’’ఈవిడగారు అడిగింది కదా అని ఈ వయస్సులో ఈవిడకి ఉద్యోగం ఎవరిస్తారని అందరు ధీమాగా ఉండి గట్టిగా అడ్డుపడలేదు. కమల తనదైన డబ్బు సంపాదించుకోవాలన్న గట్టి పట్టుదల ఏర్పరుచుకొన్నాక ఉద్యోగం పెద్ద కష్టం లేకుండానే దొరికింది.ఉద్యోగం దొరికిన కొన్నాళ్లకి తనకంటూ తనదైన ఒక ఇల్లు ఎంత చిన్నదైనా సరే, ఇరుకుదైనా సరే అద్దెకు సంపాదించాలనుకుంది.

కమల ఆఫీసులోనే పనిచేస్తున్న ఆవిడ తన తండ్రి తనకి వదిలిపోయిన చిన్న ఇంట్లో చిన్న భాగం విడిగా ఏర్పాటు చేసి కమలకి అద్దెకిచ్చింది, కంపెనీ కోసం. ఆ మర్నాడు కమల ఆఫీసుకి సెలవుపెట్టి బాంకుకి వెళ్లింది. బాంకులో ఆమె పేర్న తండ్రి పోతూ పోతూ వేసిన పదివేల రూపాయలు ఫిక్సెడ్‌ డిపాజిట్‌లో ఉన్నాయి. దానిమీద అయిదువేలు అప్పు తీసుకుని ఇంటికి కావలసిన వస్తువులు ఒక మంచం, పరుపు, స్టౌ, పప్పులు, ఉప్పులు మొదలైనవి కొని పెట్టుకుంది.ఆపైన తన భర్త ఇంటికి వెళ్లింది. అప్పుడు భర్త ఇంట్లో ఉండడని ఆమెకి తెలుసు. తనతో కొని తెచ్చుకున్న పెట్లో తన బట్టలు నాలుగూ సర్దుకొంది.

‘‘మీరు నన్ను ఏలుకోవడానికి గాను మా పుట్టింటివారు మీకు పెట్టిన లంచాలు, మంచాలు, కంచాలు మీకే, మీ ఇంట్లో వదిలిపెట్టి వెళ్తున్నాను. ఇన్నాళ్లు మీరు నన్ను పోషించారు. నేను చాకిరీ చేశాను. రెండింటికీ చెల్లు. ఇందులో నా ఎడ్రస్‌ ఇస్తున్నాను. ఆ ఇల్లు అద్దెది. కాని అది ‘నా’ అద్దె ఇల్లు. మీకెప్పుడైనా రావాలనిపిస్తే రండి. వచ్చినప్పుడు తినాలనిపిస్తే నావంట తినండి. నా ఇంట పడుకోవాలనిపిస్తే పడుకోండి. ఇదే నా ఇంటికి మీకు నా ఆహ్వానం’’ అని భర్తకో చీటీ వ్రాసిపెట్టి, పెట్టె పుచ్చుకుని బయటకు వచ్చి ఇల్లు తాళం వేసి, తాళం చెవి పక్కింట్లో ఇచ్చింది. ఆవిడ అడగనే అడిగింది,