ఆనందరావుకు ఒక్కసారి గట్టిగా ఏడవాలనిపించింది! వెక్కి వెక్కి ఏడవాలనిపించింది! కరువుతీరా, కడుపారా ఏడవాలనిపించింది! అచ్చుకు నోచుకోని అక్షరాలున్న ఫైళ్ళను చూసి బావురుమని ఏడవాలనిపించింది!ఐదు సంవత్సరాలుగా తాను కష్టపడి, శ్రమపడి, బాధపడి, చెమటోడ్చి తయారు చేసుకొన్న అయిదు ఫైళ్ళను చూస్తుంటే కళ్ళవెంట గిర్రున నీళ్ళు తిరుగుతున్నాయి. తాను తపనచెంది, తననూ తపన చెందించి... ఆండాళ్ళు తన చేత ప్రాణంపోయించిన వివిధ రచనా ప్రక్రియలున్న ఫైళ్ళను చూస్తుంటే దుఃఖం తన్నుకొచ్చేస్తుంది!తనను ఆంధ్రుల అభిమాన రచయితగా చూడాలనుకున్న ఆండాళ్ళు ఆశ నిరాశకావలసిందేనా! ఓ సాహితీకారునిగా తనతో అక్షర వ్యవసాయం చేయించి, ఫలసాయం కోసం ఎదురుచూస్తున్న ఆమె ఆశ అడియాస కావలసినదేనా!

సరిగ్గా... ఐదు సంవత్సరాల క్రితం ఆనందరావు అక్షర రమ్యతను గుర్తించింది ఆండాళ్ళే! చక్కగా ముత్యాలకోనలా... తుమ్మెదల బారులా గుండ్రంగా... తను ఫైళ్ళపై రాసుకున్న ముద్దులొలికే అక్షరాలను చూచి ముచ్చటపడింది కూడా ఆండాళ్ళే! ‘‘అబ్బ! అక్షరాలెంత బాగున్నాయో! గుండ్రంగా, ముత్యాలసరంలా, నల్లపూసల గొలుసులా, బీడ్స్‌ ఉన్న చైన్‌లా ఎంతబాగున్నాయో!’’ అమితాశ్చర్యం ప్రకటించింది. ఓ హగ్‌ ఇచ్చేసింది.‘‘ఏమనుకున్నావ్‌! ఈ అక్షరాలన్నీ నీ పతి దేవుడు రాసినవే! నేను కాక ఇంకెవరు ఇంత చక్కగా రాయగలరు’’ ఆనందం కాలరెత్తుకున్నాడు.కోడి కెలికినట్లుండే తన చేతిరాతను గుర్తుచేసుకుని ఆండాళ్ళు నిట్టూర్చింది. 

ఆ రాత తన తలరాతను ఎలా మార్చిందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంది.‘‘ఎంత బాగా పరీక్షలు రాసినా, ఆ అర్థంకాని హ్యాండ్‌ రైటింగ్‌తో విసిగిపోయి ఏనాడూ తనకు ఫస్ట్‌క్లాస్‌ ప్రసాదించలేదు ఎగ్జామినర్లు. దీంతో తెలుగు పండిట్‌ అయిన తండ్రి ఇంటర్‌ బైపీసీతో చదువు ఆపించేసి, తన చేత ఎన్నో కావ్యాలు చదివించాడు. ఇతిహాసాలు, పురాణాలు, ఆధునికి సాహితీ ప్రక్రియలన్నీ పరిచయం చేశాడు. ఈలోపు ఆనందం పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఇంకేముంది, అతని అర్ధాంగిగా మారిపోయింది.రాత్రి పది గంటల దాకా ఆఫీసు ఫైళ్ళన్నింటిపై... అక్షరాల్ని శిల్పాల్లా చెక్కుతున్న తన భర్త హేండ్‌రైటింగ్‌ను యాజమాన్యం ఎలా వాడుకుంటోందో అర్థమైంది.