గొణుక్కుంటూ అరుగువైపు పరుగెత్తాడు. ఇంతలో అన్నగారొచ్చి, కన్నీళ్ళతో అరుగు దగ్గరికి తీసుకెళ్ళి, శవం మొహంమీద కప్పిన గుడ్డ తీశాడు.తైల సంస్కారంలేని తెల్లజుట్టు, పెరిగిన నెరిసిన గెడ్డం, ఎవరో స్వాములవారిలా ఉన్నారు. ఎవరా అని నిశితంగా చూశాడు. హరికృష్ణ ఒళ్ళు ఝల్లుమంది.
**********************
‘‘ఏంటి గోపాలంగారూ! మీరే ఇలా దిగులుగా ఉంటే ఎలా? ఆఖరిసూపు దక్కాలంటే అరిజెంటుగా రమ్మని మీ తమ్ముడిగోరికి కబురంపకపోయారా?’’‘‘హరికి ఫోను చేశా పోలయ్యా. తమ్ముడు ఈ పాటికి బయలుదేరే ఉంటాడు. హైదరాబాద్ నుంచి రావాలిగా టైమ్ పడుతుంది’’.‘‘మీ నాయనగోరున్నప్పుడు, మీ అరుగే ఓ పంచాయతీ ఆఫీసు, మీఇల్లే ఓ దివాణం. అలాటిది ... ఏం సేత్తార్లెండి వత్తానండి సేనుకి నీరెట్టాలి’’.ఆలోచిస్తూ అరుగుమీదకూర్చున్న గోపాలంగారు పూజారిగారి పలకరింపుతో బాహ్య ప్రపంచంలో పడ్డారు.‘‘గోపాలంగారూ, తమ్ముడుగారు వచ్చారా?’’‘‘లేదండీ పూజారిగారూ! వెంటనే రమ్మనమని ఫోను చేశా’’‘‘మీ నాన్నగారు కరణంసుబ్బారావుగారు బతికున్నరోజుల్లో మీ ఇల్లు కళకళ్ళాడుతూ కణ్వాశ్రమంలా ఉండేది. మీ వ్యవసాయం నక్కలపాలైతే కరణీకం కుక్కలపాలైంది. ఏదైనా నుదుట రాతను తప్పించలేం.
ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి’’.‘‘నిజమే. అన్నిటికి ఆ దేవుడే ఉన్నాడు. మా అబ్బాయి సుబ్బుపేరున గుళ్ళో ఈరోజు అభిషేకం చేయించండి’’.‘‘ఎంతమాట మీరు వేరే చెప్పాలా? మనం మానవమాత్రులం, నిమిత్తమాత్రులం. ఎవరికి, ఎప్పుడు ఏది ప్రాప్తమో ఆ ఏడుకొండలవాడికే తెలుసు. వస్తా గోపాలంగారు’’ అని వెళ్ళిపోయారు పూజారిగారు.దొడ్డిగుమ్మాన వెడుతున్న పనిమనిషి పాపమ్మ అరుగుమీద దిగులుగా కూర్చున్న గోపాలంగార్ని చూసి ఆగిపోయింది.‘‘బాబుగోరూ! మీ తమ్ముడుగోరు ఎప్పుడొత్తారు?’’‘‘సాయంత్రంలోపు రావచ్చు’’‘‘ఏంటోనండి.
ఆకలన్నది ఎరక్కుండా మీసేతిసలవవల్ల సుకంగా ఈ ఇంటిని నమ్ముకుని బతికా, అలాటిది...’’ కొంగుతో కన్నీళ్ళు తుడుచుకుంది పాపమ్మ.‘‘బాధపడకు. ఏదీ మనచేతుల్లో లేదు. అంతా దైవనిర్ణయం’’.‘‘ఊరంతా దండోరావేసిచెప్పు నాన్నా మన ఇంటి పరిస్థితి’’ అంటూ సుబ్బు, భుజంమీద తువ్వాలుతో అరుగుమీద దుమ్ముదులిపి తండ్రి పక్కనే కూర్చున్నాడు కోపంగా.‘‘అందరికీ తెలిసిందానికి వేరే డప్పుకొట్టడం ఎందుకురా? పల్లెటూర్లో ఏ ఇంట్లో ఏం జరిగినా ఆత్మీయులన్నవారికి తెలుస్తూనే ఉంటుంది. అడక్కపోయినా సానుభూతిగా మాట్లాడుతూనే ఉంటారు’’.