రాత్రి ఒంటిగంట దాటుతోంది.కాకినాడ వెళుతున్న గౌతమీ ఎక్స్‌ప్రెస్‌ ఇరవై నిముషాల క్రితమే ఖాజీపేట దాటింది.బోగీలో డిమ్‌గా బ్లూలైటు వెలుగుతోంది. అంతా నిద్రపోతున్నారు.సంక్రాంతి వెళ్లిన రోజులు కావడంతో అంత చలిగానూ లేదు, అలాగని వెచ్చగానూ లేదు. ట్రెయిన్‌ ఎక్కిన తరువాత ఓ గంటకి నిద్రకి ఉపక్రమించిన భానుమూర్తికి ఎంతసేపటికీ నిద్రపట్టలేదు. అయినా అలాగే బెర్తుమీద పడుకుని అటూఇటూ దొర్లుతూ నిద్రపోదామని చాలా ప్రయత్నించాడు. 

ఇంటి దగ్గరైతే ఈ మధ్య నిద్రమాత్రలు వేసుకుంటున్నాడు. రైలు ప్రయాణం కనుక ఎందుకైనా మంచిదని నిద్రమాత్ర వేసుకోలేదు. ఎంత ప్రయత్నించినా ఇక నిద్రరాదని నిశ్చయించుకుని విండోకు ఎయిర్‌పిల్లోను ఆన్చుకుని కాస్త పైకిజరిగి కూర్చున్నాడు. మామూలుగా కూర్చోవడానికి మిడిల్‌బెర్తు అడ్డం ఉండడంతో తలకి తగులుతుంది కనుక పిల్లోను విండోకు ఆన్చుకున్నాడు. కళ్ళు మూసుకుని అలానే ఆలోచిస్తూ కూర్చున్నాడు.తనకి ఎదురుగా లోయర్‌ బెర్తుమీద పడుకున్న కనకరత్నం కూడా అలానే నిద్రపట్టక అవస్థ పడుతోంది. ట్రెయిన్‌ ఎక్కిన తరువాత ఓ గంటకి మాగన్నుగా ఓ నలభైనిమిషాలపాటు నిద్రపట్టినట్టు అనిపించినా అంతలోనే ఆమెకు మెలకువ వచ్చేసింది. అప్పటినుంచీ ఆమెకు ఇక నిద్రపట్టలేదు.

ఎదురు బెర్తుమీదున్న భానుమూర్తికేసి చూసింది. పైకిలేచి విండోకి జేరగిలబడి గుండెలమీద చేతులు వేసుకుని కళ్ళు మూసుకున్నాడు.‘‘నిద్ర పట్టడం లేదా?’’ అడిగింది అతడిని. అతడు కళ్ళు తెరచి ఆమెకేసి చూశాడు. ఇంకా ఎంత దూరం?’’ అడిగిందామె.‘‘ఇంకో సిక్స్‌, సెవెన్‌ హవర్స్‌ జర్నీ...’’ చెప్పాడు భానుమూర్తి.ఆమె కళ్ళు మూసుకున్నది. నిద్ర రావడంలేదు. కానీ ఆలోచనలు మాత్రం వస్తున్నాయి. ట్రెయిన్‌ ఎక్కకముందు ఎన్నిరకాల ఆలోచనలు, ప్రశ్నలు, సంతృప్తీ, అసంతృప్తులతో కూడిన సమాధానాలు తనను అస్థిమితం చేశాయో, ఇప్పుడూ అలానే, అవే ప్రశ్నలు, అవే ఆలోచనలు ఆమెను చుట్టుముట్టాయి. అతడితో ఆమె ఇలా ప్రయాణమై రావడం, మంచా? చెడా? అన్నది ఇప్పటికీ ఇదమిత్థంగా ఆమె తేల్చుకోలేకపోతోంది. ఆవేశపడిందా? అని ప్రశ్నించుకుంటే, కాదులే! అని అంతరాత్మ సమాధానం చెబుతోంది.