మేము కొత్త ఇంట్లోకి వెళ్ళి వారం రోజులైంది.మిద్దెమీద రెండో అంతస్తులో మా ఇల్లు. మా ఇంటికి ఎదురుగా సరిగ్గా రోడ్డుకి అవతల మేము కొత్తగా హోటల్‌ పెట్టాం. శాఖాహార భోజన, ఫలహారాల హోటల్‌. రుచీ, శుచీ బాగుండాలని హోటల్‌ పేరు కూడా ‘‘రుచీ ఫాస్ట్‌ ఫుడ్స్‌’’ అని పెట్టాం. మా వారు ఇతర బిజినెస్‌ వ్యవహారాల్లో తనములకలై ఉండటంతో హోటల్‌ బాధ్యతలు పూర్తిగా నేనే నిర్వహించేదాన్ని. మేం ఎక్కడ ఉన్నా చుట్టుప్రక్కల వారందరినీ పరిచయం చేసుకోనిదే నా మనస్సాగదు. చాలావరకూ అందరూ పరిచయం అయ్యారు. అందరికీ పనిలో పనిగా మా హోటల్‌ గురించి కూడా పబ్లిసిటీ ఇచ్చుకున్నాను.

ఆ రోజు మిద్దెపైన ఇంటిముందు వరండలోపెట్టిన పూలకుండీలకు నీళ్ళుపోస్తూ యథాలాపంగా కిందకు చూశాను. అది సరిగ్గా మా ఇంటి వెనుకవైపు (రైల్వే) రైలు పట్టాలు. వాటికి అవతల రైల్వే క్వార్టర్స్‌ ఇళ్ళు. పెద్దపెద్ద చెట్లతో ప్రకృతి మాత పచ్చచీర కట్టుకున్నట్టు కనులకింపుగా ఉంది. ఇంటిలోకి రాబోతూ హఠాత్తుగా కింద ఉన్న ఓ చిన్న రేకుల ఇంటివైపు చూశాను. ఇంటి ముందర చాలా జాగా ఉంది. అంతా పిచ్చిచెట్లు మొలిచి, రాళ్ళు రప్పలతో చిన్న సైజు అడవిలా గోచరించింది. ఇంటిముందర ఎప్పటివో చీకిపోయిన తాటాకులతో వేసిన పందిరి.

ప్రక్కనే బాగా పాచిపట్టిన నీళ్ళతొట్టి, చిన్న బండ ఉన్నాయి. ఆ ఇంట్లో మనుష్యులు ఉన్నట్టు ఆనవాలేమీ కనబడలేదు. ‘అందరినీ పరిచయం చేసుకున్నాను. ఈ ఇంట్లో ఎవరుంటున్నారో ఏమో’ అని నాలో నేనే పెద్దగా అనుకుంటూ ‘ప్రక్కింటి సుభద్ర పిన్నీవాళ్ళని అడుగుదాం’ అనుకున్నాను. ఆ సాయంత్రమే హోటల్‌నుంచి ఇంటికి వచ్చాక ఆ రేకుల ఇంటి గురించి ప్రక్కింటి పిన్నిగారిని అడిగాను.