‘‘అబ్బ ... ఇంత ఎండగా ఉందేంట్రాబాబూ’’ అనుకున్నాడు సూర్య ఇన్నోవా దిగగానే.అతనితో పాటూ దిగిన కొలీగ్స్ నెత్తిపైన కేప్స్ సవరించుకున్నారు. సూర్య టోపీ తీసుకురావడం మర్చిపోయాడు. ఒక్కరోజు ఆఫీసు పనికి అవన్నీ ఎందుకనుకున్నాడు. కానీ అదే అతని కొంప ముంచింది. ఆ ప్రాంతం దాదాపు ఎడారిలా ఉంది. ఒక్క చెట్టు కూడా లేదు. ఎండ నడినెత్తి మీద నాట్యం చేస్తోంది. కేవలం పార్క్ చేసిన వెహికల్స్ పక్కన నిలబడి వాటి నీడలో కాసేపు సేద తీరారు అందరూ. సూర్య కర్చీఫ్ నెత్తికి కట్టుకున్నాడు. అయినా పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. వేడికి బుర్ర ఫ్రై అయిపోయింది.
అక్కడి మేనేజర్ బయటి నుండి లంచ్ తెప్పించాడు. మంచి ఆకలి మీద ఉన్నాడేమో కొంచెం ఎక్కువగానే తిన్నాడు సూర్య. తర్వాత కొంచెం సేపు రిలాక్స్ అయి పనిలో పడ్డారు. సాయంత్రానికి ఫీల్డ్ వర్క్ ముగించుకుని రాత్రి పదిన్నరకి ఇంటికి చేరుకున్నాడు. అప్పటికి నెమ్మదిగా ఫీవర్ స్టార్ట్ అయింది. దాంతో పాటూ కడుపు నొప్పి! అసలే కరోనా కాలం.. అన్నీ కరోనా లక్షణాలే! నెమ్మదిగా అతని గుండెలో భయం మొదలైంది. ఆ రాత్రికి డోలో 650 టాబ్లెట్ వేసుకుని నిద్రపోయాడు.తెల్లారి లేచేటప్పటికి జ్వరం తగ్గింది. మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చింది. ఎందుకైనా మంచిదని దగ్గర్లో ఉన్న క్లినిక్‌కి వెళ్ళాడు. డాక్టర్ టెస్ట్ చేసి ‘‘ఈ టాబ్లెట్స్ వాడండి, తగ్గిపోతుంది’’ అని రాసిచ్చాడు. సాయంత్రం వరకు బాగానే ఉంది కానీ... రాత్రి మళ్ళీ ఒళ్ళు వేడెక్కింది.సూర్యలో నెమ్మదిగా భయం పెరగసాగింది. కొంపదీసి కోవిడ్ కానీ తన ఒంట్లో ప్రవేశించ లేదు కదా! అతని అవస్థను భార్య ప్రీతి గమనించింది.‘‘అంత డౌట్ ఉంటే రేపు కోవిడ్ టెస్ట్ చేయించుకోండి’’ అని సలహా ఇచ్చింది.‘‘సరే ... రేపు మన కాలనీలో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్ (పి.హెచ్.సి) కి వెళ్ళి చేయించుకుంటాలే ..’’ అని చెప్పి పడుకున్నాడు కాని, రాత్రంతా కలత నిద్ర.