వారంరోజులుగా ఆలోచిస్తోంది అన్నపూర్ణమ్మ.తనకొచ్చిన ఆలోచన అమలుపరచమని ఇద్దరు కొడుకులతో సంప్రదించింది. కానీ వాళ్ళు పడనిచ్చేలా లేరు. ‘‘ఎప్పటిలాగే జరిపిచ్చేద్దాం. నీదంతా చాధస్తం..’’ అంటూ చిన్నకొడుకు రవిచంద్ర తనుచెప్పిందాన్ని కొట్టిపారేశాడు.
ఈ ఒక్కసారి తనమాట వినమని బ్రతిమిలాడుతోంది అన్నపూర్ణమ్మ. తల్లి అడిగింది పెద్ద కోరికేం కాదు. తీర్చగలిగిందే. కానీ ‘దానికోసం బోలెడంత సమయం, డబ్బు వృధా అవుతాయి’ అని వాళ్ళ అభిప్రాయం. ‘‘ఆ..అంతదూరం ఏం వెళ్ళగలం. వెళ్ళినా అక్కడ మనకోసం స్వాగతం పలికేవాళ్ళు ఎవరున్నారట. వయసు మీద పడుతున్నకొద్దీ మీ అమ్మకి చాధస్తం ఎక్కువవుతోంది. తిని కూర్చుంటుంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి మరి..’’ అంటూ కోడళ్ళు ఆమెకి వినిపించేలాగే భర్తలకి స్టేట్‌మెంటు ఇచ్చేశారు.అన్నపూర్ణమ్మ మథనపడిపోతోంది. తనకోరిక తీరదా! అన్న దిగులు ఎక్కువైపోయింది. ఆవిడ వయస్సు తక్కువేమీ కాదు ఎనభై ఐదేళ్ళు. వచ్చే ఏటికి ఉంటుందో లేదో తెలీదు.
ఎవరూ తోడులేనిదే కదలలేని వృద్ధాప్యం. ‘చాలా చిన్నకోరిక తనది’ అని ఆమె భావన. కానీ కొడుకులు ఆ కోరికను మన్నించేంత ఖాళీగా లేరు. డబ్బు ఖర్చు చెయ్యొచ్చుగానీ కాలాన్ని ఖర్చు చెయ్యటం ఇష్టంలేనివాళ్ళు. వ్యాపారాల్లో బిజీగా ఉన్నవాళ్ళు, రెండుచేతులూ సరిపోక ప్రయాసపడుతున్న వాళ్ళు.అన్నపూర్ణమ్మకి ఇద్దరు కొడుకులు రవిచంద్ర, రాధాక్రిష్ణ. వాళ్ళకీ నలుగురు పిల్లలు. ఇప్పుడిప్పుడే వాళ్ళకీ పిల్లలు తయారవుతున్నారు. ఆవిడ నాలుగోతరాన్ని చూసేసింది.
‘‘పోనీ నానమ్మ కోరిక వినొచ్చుగా డాడ్!’’ రవిచంద్ర కొడుకు తండ్రిని రిక్వెస్ట్ చేశాడు. ఎందుకంటే అతనికి నానమ్మ కోరికలో ఎగ్జయిట్‌మెంట్ ఉంది.‘‘వినడానికి అది చిన్నకోరికేగానీ, ఎంత ప్రయాస. ముసలావిణ్ణి ఇక్కడినుంచి అక్కడకి చేరే యడం ఎంతకష్టం... పైగా అన్నీ సమకూర్చుకోవాలంటే వారం ముందే ఇక్కడి పనులన్నీ వదులుకొని అందరం బయల్దేరాలి. అంతా టైమ్ వేస్ట్ రా...’’ అని తీసి పడేశాడు రవిచంద్ర. పిల్లలందరూ నానమ్మ తరపునే వాదిస్తున్నారు.