హోరున వాన కురుస్తోంది..‘‘ట్రాఫిక్ మరీ పెరిగిపోయింది.. అర కిలోమీటరుకు అరగంట పడుతోంది‘‘ - గట్టిగా అన్నాడు విశాల్.పరధ్యానంగా కిటికీలో నుంచి ట్రాఫిక్ చూస్తున్న మానస ఉలిక్కిపడింది.‘‘ఏంటి ఆలోచిస్తున్నావు’’- అడిగాడు విశాల్.‘‘పంజాగుట్ట శ్మశానం’’- అంది మానస. ‘‘శ్మశానం’’ రెట్టించాడు విశాల్.‘‘శ్మశానాన్ని తవ్వేస్తున్నారు...’’ నిద్రలోంచి హఠాత్తుగా లేచిన దానిలా గట్టిగా అంది మానస.‘‘ఇందాకటి నుంచి చూస్తున్నా.. శ్మశానమంటావు.. తవ్వేస్తున్నారంటావు.. ఏమైంది నీకు’’ అన్నాడు విశాల్.‘‘రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కాస్తంత పక్కకు కూడా చూడాలి.. గుడ్డి గుర్రంలా వెళ్లిపోతే ఎలా..’’ ఎద్దేవా చేసింది మానస.‘‘వాదన సరే.. ఏమైందో చెప్పు..’’ అన్నాడు విశాల్ కొంచెం చిరాకుగా..‘‘రోడ్డును వెడల్పు చేయటానికి శ్మశానాన్ని తవ్వేస్తున్నారు. అప్పుడు దయ్యాలు బయటకు వస్తే’’ అంది మానస కొద్దిగా భయంగా.‘‘అంత చదువు చదివావు.. పట్టణంలో పుట్టా నంటావు.. నువ్వు కూడా దయ్యాలంటున్నావు.. రాత్రి టీవీల్లో వచ్చే దయ్యాల సీరియల్స్ చూడటం మానేయ్’’ అన్నాడు విశాల్.‘‘నిజంగానే అడుగుతున్నా. రోడ్డును వెడల్పు చేయటానికి తవ్వుతారుగా.. అప్పుడు కొన్ని సమాధులు బయటపడతాయి కదా. సమాధులను పగలకొడితే వాటి నుంచి క్షుద్ర శక్తులు బయటకు వస్తాయంటారు..’’ అది ఏదో చెబుతోంది.. పక్కనో కారు హారన్ గట్టిగా మోగింది.‘‘నిమిషం ఆగరు.. అలాగని ట్రాఫిక్ సెన్స్ ఉండదు’’ అంటూ తిట్టుకుంటూ కారును ముందుకు ఉరికించాడు విశాల్..
ఆ సంభాషణ అక్కడితో ఆగిపోయింది.. మానస ఇంకా పరధ్యానంగా కిటికీలోనుంచి చూస్తూనే ఉంది.్్్విశాల్, మానసలకు పెళ్లి అయి ఆరు నెలలు అయింది. ఇద్దరూ హైటెక్ సిటీలో ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్నారు. జీతాలు బాగా వస్తాయి. పెళ్లి అయిన మూడు నెలలకే కావాల్సినవన్నీ కొనుక్కున్నారు. చిన్న చిన్న గొడవలు ఉన్నా మొత్తం మీద సంసారం బానే సాగిపోతోంది. విశాల్‌కు ఓపిక ఎక్కువ. పగలు, రాత్రి చేయాల్సిన ఉద్యోగం అతని ఓపికని మరింత పెంచింది. మానసకి చిరుకోపం. చిన్న చిన్న విషయా లను ఎక్కువగా పట్టించుకుంటుంది. ఆఫీ సులో కూడా అదే పరిస్థితి. దాదాపు ప్రతి రోజు ఆఫీసు నుంచి వచ్చే సమయానికి మానస మూడ్ ఆఫ్ అయిపోయే ఉంటుంది. విశాల్ ఎప్పటికప్పుడు సర్దిచెబుతుంటాడు. ఆ రోజు కూడా మానస మూడ్ బాగాలేదు. ‘‘వెధవలకు ఏం రాదు.. ఎర్ర బస్సు ఎక్కేసి వచ్చే స్తారు..’’ అని తిట్టుకుంటూ సాయంత్రం కారెక్కింది. ‘‘ఏమైంది?’’ అడిగాడు విశాల్.‘‘కాల్లో పొద్దున్నంతా గొడవే.. ఆన్సైట్లో ఏదో అడుగుతారు.. వీళ్లకి ఏం చెప్పాలో తెలి యదు. దీనితో అనేక ఇబ్బందులు’’ అంది మానస.‘‘కొత్తేముంది.. సరే.. కూరలు కొనాలా.. ఉన్నాయా?’’ అని టాపిక్ మార్చాడు విశాల్. ఇం టికి వచ్చేసరికి వాన మరింత పెరిగింది. విశాల్ వాళ్ల ఇల్లు మొదటి ఫ్లోర్లో ఉంటుంది. వంటింటి కిటికీకి ఆనుకొని పెద్ద వేప చెట్టు ఉంటుంది. వేసవి కాలంలో చల్లటి గాలి వేస్తుంది. శీతకాలం, వానా కాలం- ఆ చెట్టు వల్ల దోమలు పెరిగిపోతాయం టాడు విశాల్. వేప చెట్టు వల్ల ఎటువంటి క్రిములు రావంటుంది మానస.