‘‘ఈవిడేనా డ్యూటీలో జాయిన్ అయ్యేది?’’‘‘అవును సార్ పేరు రాజ్యలక్ష్మి. అన్నిజాగ్రత్తలు చెప్పాను. మీకెలాంటి ఇబ్బంది కలగనివ్వదు’’ అన్నాడు రెడ్‌క్రాస్‌వ్యక్తి ధనుంజయ్.అతడి భుజంమీద చెయ్యివేసి ప్రక్కకు తీసుకువెళ్ళి, ‘‘ఆవిడ ఆయానా? చూస్తే పెద్దింటావిడలా ఉంది. తీరా ‘నేను ఆపని చెయ్యను–యీ పని చెయ్యను’ అంటే...’’అదేంలేదు సార్. ఏ యిబ్బందిరాదు. ఒకవేళ అటువంటిదేదైనా జరిగితే నాకు ఫోన్ చెయ్యండి. వెంటనే వేరొకర్ని తీసుకువస్తాను’’.
‘‘అలాగైతే ఓ.కె. ఇదిగో ఈ నెల డబ్బు, తీసుకో’’డబ్బు తీసుకుని ‘‘మంచిది సార్ వస్తాను’’ అని బైక్‌స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు ధనుంజయ్.చేతిలో బ్యాగ్‌తోవున్న రాజ్యలక్ష్మిని లోపలికిరమ్మని చేత్తో సైగచేశారు మీనేశ్వరరావు. ఆయన్ను అనుసరించింది పరిసరాలు గమనిస్తూ రాజ్యలక్ష్మి. పాతకాలపు ఇల్లు. వారసత్వానికి, సంప్రదాయానికి ప్రతీకలా, వయసు పైబడినగుర్తులుగా పెచ్చులూడిపోయి, సున్నంరాలిపోయి, ఫ్లాట్లు, టవర్స్ మధ్య కుంచించుకుపోయి, పదవి కోల్పోయినవాడిలా ఉంది ఆ ఇల్లు.
మెట్లు ఎక్కి వరండాదాటి చీకటిగావున్న కుడివైపు గదిలోకి దారితీసి,‘‘ఇదిగో, నీ పేరు.. ఆఁ రాజ్యలక్ష్మి కదూ, నీ బ్యాగు ఆ మూల పెట్టుకో. చూశావుగా. ఆ మంచంమీద ఉన్నది మా బాబాయ్. వయసు ఎనభై పైమాటే! అన్నీ నువ్వే చూసుకోవాలి. అన్నీ అంటే, అన్నీ. అర్థమైందనుకుంటా! నేనూ నా భార్య ఇద్దరం ఉద్యోగస్థులం. నేను ఈరోజు పర్మిషను తీసుకుని వచ్చాను. వెంటనే వెళ్ళాలి. జ్యోతి..అదే నా భార్య సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వస్తుంది. నాకు ఇద్దరుపిల్లలు. వాళ్ళు నాలుగుగంటలకు వస్తారు. వారికోసం నువ్వేమీ చెయ్యక్కర్లేదు. జస్ట్ ఇన్‌ఫర్మేషన్ అంతే! అన్నట్లు భోంచేసి వచ్చావా.. లేక చెయ్యాలా?’’