కన్ను తెరచుకున్నా కనిపించని కటికచీకటిలో పరుగెడుతున్నాడు శ్రీధర్‌. రాళ్లు, రప్పలు గుచ్చుకుని పాదాలు రక్తమోడుతున్నా, ఎగ ఊపిరితో అలసటొచ్చి ఆయాసపడుతున్నా, అరక్షణమైనా ఆ పరుగుని ఆపడంలేదతను. ప్రమాదమేదో ముంచుకొస్తున్నట్లు భయాందోళనలతో వడివడిగా అడుగులు వేస్తూ ఉరుకులు, పరుగులు పెడుతున్నాడు.

‘‘ఏమండీ...’’ వెనుక నుంచి భార్య సుజాత పిలుపు.‘‘కాస్త ఆగండి’’ గట్టిగా అరుస్తోందామె. అయినా, అతడేమాత్రం స్పందించడం లేదు.‘‘నా బంగారం.. ‘నా బుజ్జీ... నా తల్లీ..’’ తన భుజంపై అపస్మారకస్థితిలో పడి ఉన్న ఆరునెలల పసిగుడ్డును అంతవేగంలోనూ మరింత దగ్గరగా హత్తుకుంటూ ముద్దుచేస్తున్నాడు.‘‘ఎవరమ్మా నిన్ను నా నుంచి దూరం చేసేది? అంత ధైర్యం ఎవరికుంది? నువ్వు నా వరాల మూటవు. నీకేం కాదమ్మా. నీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డు కదా!’’ అంటున్నాడు శ్రీధర్‌ చెమర్చే కళ్ళతో.‘‘ఏమండీ.. ఒక్కసారి ఆగండి. మీరేం అధైర్య పడొద్దు. మన పాపకేం కాదు. మీరు నమ్మండి’’ వెనుక నుంచి శ్రీమతి ధైర్యం చెప్తోంది.‘‘ఆయాసం వల్ల నేను పరుగెత్తలేకపోతున్నాను.

ప్లీజ్‌! ఆగరూ!’’ దీనంగా అర్థిస్తోంది.‘‘ఒక్కక్షణం ఆగినా.. మన పాప ప్రాణాలు మనకు దక్కవు సుజాత. వాళ్లు మనుష్యులు కారు. కాసులకోసం కక్కుర్తిపడే నీచులు. దుర్మార్గులు. డబ్బు కోసం పసిపిల్లల్ని కూడా బలితీసుకునే ఉన్మాదులు. ఇంకెంతదూరం? ఒక్కటంటే ఒక్క కిలోమీటరు. అది దాటితే మనఊరు వచ్చేస్తుంది. మనం క్షేమంగా బయటపడినట్లే. పాపని క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళొచ్చు..’’ భార్యకి వినిపించేలా చెబుతున్నాడతడు గట్టిగా.అతడి భుజంపై వాలిపోయి ఉన్న పాప చేతిమణికట్టుకు వేలాడుతూ సెలైన్‌ బాటిల్‌ గొట్టం. వెనుకనుంచి అతడినే అనుసరిస్తూ వస్తున్న అతడి భార్య చేతుల్లో సెలైన్‌స్టాండ్‌.