‘‘వెరీ ఇంట్రస్టింగ్‌ ఇన్వెస్టిగేషన్‌. వెంటనే రాగలవా?’’ అన్నాడు సుదర్శన్‌ ఫోన్లో.సుదర్శనం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న లాయరు. నాకు మిత్రుడు. నేర పరిశోధన నాకు హాబీ. అది హాబీ కాదు, ప్రతిభ అంటాడు సుదర్శనం. నామీద తనకెంత నమ్మకమంటే, నన్ను చాలాసార్లే పరిశోధనలో ఉపయోగించుకున్నాడు. ఉత్తినే కాదు, ప్రతిఫలం విషయంలో అతడు చాలా ఖచ్చితం.

‘‘కేసేమిటి?’’ అన్నాను కుతూహలంగా.‘‘టీవీలో రోజూ చూస్తూనే ఉండి ఉంటావు. చంద్రిక ఆత్మహత్య కేసు’’ అన్నాడు సుదర్శనం. చంద్రిక భర్త మాధవ్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరు. ఆమె మ్యూజిక్‌ స్కూల్‌ నడుపుతోంది. అక్కడ శాస్త్రీయసంగీతం, లలితసంగీతంతోపాటు, సినిమాలకీ, స్టేజి షోలకీ అనువైన శిక్షణ లభిస్తుంది. ఆమె శిష్యులకి టీవీల్లోనూ, స్టేజి షోల్లోనూ బాగా అవకాశాలొస్తున్నాయి. అందుకు సాయపడేవాళ్ళల్లో ముఖ్యుడు ప్రతాప్‌. ప్రతాప్‌కీ ఆమెకీ స్నేహానికి మించిన అనుబంధముందని పుకారుంది. కానీ మాధవ్‌, తన భార్య నిప్పు అనీ తమది కలతలు లేని ఆదర్శదాంపత్యమనీ అంటాడు. ఆ దంపతులకి ఒక్కగానొక్క కూతురు. ఉమకి ఇప్పుడు ఆరేళ్ళు.

చంద్రిక ఆత్మహత్య చేసుకుందన్న వార్త నాలుగురోజుల క్రితం మీడియాలో వచ్చింది. రొటీన్‌గా మొదలై సంచలనవార్తగా మారింది. చంద్రికది హత్యా–ఆత్మహత్యా? అన్న పరిశోధన కూడా మొదలైంది. అందులో నా పాత్ర కూడా ఉంటే అదో థ్రిల్‌. ‘‘ఇప్పుడే బయల్దేరుతున్నాను’’ అన్నాను సుదర్శనంతో.డ్రస్‌ మార్చుకుని కదిలానో లేదో అమ్మ హడావిడిగా వచ్చింది. ‘‘శాస్త్రిగారు రెండు ఫోటోలు తెచ్చార్రా. పిల్లలు చాలా బాగున్నారు...’’ ఇలాంటివి నేను బయటకెడుతున్నప్పుడే చెబుతుంది అమ్మ. ఇంట్లో అయితే వెంటనే నో అనేస్తానని తన భయం. ఇప్పుడైతే విని ఊరుకుని, బయటున్నంతసేపూ ఆ విషయమై ఆలోచిస్తానని తన ఆశ! అమ్మ ఆశపై నీళ్ళు చల్లుతూ, ‘‘ప్రస్తుతానికి పెళ్ళి మాటెత్తొద్దమ్మా’’ అన్నాను.