నువ్వు నేను వేరనే భావన లేనప్పుడు, ఒకరికొకరు సొంతమైపోయినప్పుడు, ఆత్మలొకటై పోతాయి. మరప్పుడు ఇరుగుండెల సవ్వడి అద్వైతమే అవుతుంది కదా!ఈ భావన వర్ష, కిరణ్‌లలో సరిగ్గా నెలరోజుల క్రితం మొదలైంది. తమ గుండెలు ఒకే రిథంలో కొట్టుకుంటున్న భావన... పెళ్లి నిశ్చయం అయ్యాక ఇద్దరు ఒకటైపోయిన భావన. కడప మెడికల్ కాలేజీలో ఆమె గైనకాలజీలో పి.జి చేస్తోంది. అతను ఢిల్లీలో ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషాలిటీ రెండో సంవత్సరంలో ఉన్నాడు. విద్య, వైద్యం కలగలిపిన కోర్సులు.ఏ చిన్న అవకాశం దొరికినా ఫోన్లో పలకరింతలు. వాట్సాప్ ఫోటో షేరింగుల్లో పులకరింతలు. ఇద్దరిమధ్యా దూరమెంతున్నా వీడియోకాల్‌లో కళ్ళు కళ్ళు కలుసుకుంటున్నాయి.‘హాయ్ బయలుదేరుతున్నా’ రూం లాక్ చేస్తూ చెప్పాడు. వర్ష అప్పుడే మెస్‌లో టిఫిన్ చేసి డిపార్ట్‌మెంట్‌కి బయలుదేరుతూ ‘ఈరోజు నుంచి కోవిడ్ డ్యూటీ అన్నావు కదా జాగ్రత్త మరి’ అంది.‘ఆఁ .. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటాలే. మన డ్రెస్సులు, గ్లౌజులు, గాగుల్స్, శానిటైజర్లూ... ఇన్ని అడ్డాలుంటే పాపం వైరస్ మనల్నేం చేయలేక ఏడ్చుకుంటూ చైనాకు వెళ్లి పోతుందిలే’ గట్టిగా నవ్వాడు కిరణ్.
‘మీ ఢిల్లీ సంఘటనతో దేశమంతా ఉలిక్కిపడింది కదా. అయినా, అవన్నీ నిజమే అనుకోకు.. బోలెడు ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయి. వాటితోనే అందరూ పానిక్ అయిపోతారు’ అని, ‘అయ్యో అనవసరంగా గుర్తు చేశానే’ అనుకుందామె.‘నిజం కాకపోవచ్చు.. కానీ నిప్పులేకుండా పొగ రాదు కదా?’ అతని మాటల్లో అపనమ్మకం.‘చూశావా.. నువ్వే అలా ఉంటే.. చివరకు మహమ్మారిని కూడా మతం కోణంలో చూసే దురదృష్టకరమైన వాతావరణం ఉంది మనదేశంలో. ఇలా వైరస్ వ్యాప్తిని కూడా రాజకీయం చేస్తే ఎలా? అర్థం చేసుకో కిరణ్! ఒక్కొక్క దేశంలో ఒక్కోరకమైన మానవ అలసత్వంతో.. దారి వెతుక్కుంటూ వైరస్ ప్రవేశిస్తోంది. దాన్ని గ్రహించి కట్టడి చేస్తే చాలు కదా’ ఆమె గొంతులో అనునయం.మాటల్లోకి కరోనా వచ్చేసరికి కడప, ఢిల్లీ ఉష్ణోగ్రతలు సమానం అయ్యాయి. ఫోన్ ఆన్ లోనే ఉన్నా ఇద్దరి మధ్యా కాసేపు మాటల్లేవు.